ముంబయికి ముంచుకొస్తున్న ముప్పు.. 2050 కల్లా..

ముంబయికి ముంచుకొస్తున్న ముప్పు.. 2050 కల్లా..
X

mumbai

దేశ ఆర్థిక రాజధాని ముంబయికి ముప్పు వాటిల్లనుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఇదే కొనసాగితే 2050 నాటికి ముంబయిలోని చాలా భాగం తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

న్యూజెర్సీకి చెందిన క్లెమేట్ సెంట్రల్ అనే సైన్స్ ఆర్గనైజేషన్ తీర ప్రాంతాలపై పరిశోధనలు చేసి 'నేచర్ కమ్యూనికేషన్స్‌' పేరుతో కథనం ప్రచురించింది. సముద్ర మట్టాలు నానాటికి పెరుగుతుండడంతో 2050 నాటికి 150 మిలియన్ల మంది నివసిస్తున్న భూమి హై టైడ్ లైన్ కిందకు కుంగే ప్రమాదం ఉందని రాశారు. ఇక ముంబయి విషయాన్ని ప్రస్తావిస్తూ.. చాలా భాగం సముద్ర అలలకు తుడిచి పెట్టుకు పోతుందని దాని సారాంశం. వాణిజ్య ప్రాంతాల విస్తరణ, బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు నగరానికి పెను ముప్పు అని వివరించారు.

నిజానికి ఇప్పుడున్న ముంబయి ప్రాంతమంతా ఒకప్పుడు ద్వీపాల సమాహారం. వాటన్నింటినీ కలిపి ముంబయి నగరాన్ని నిర్మించారు. ఇక దక్షిణ వియత్నాం అయితే పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అధ్యయనం తెలిపింది. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి తీర ప్రాంత ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉందని పరిశోధనలు సాగించిన ప్రతినిధులు పేర్కొంటున్నారు.

Next Story