ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళిసై వద్దకు అఖిలపక్షం నేతలు

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకెళ్లారు అఖిలపక్షం నేతలు. కార్మికుల ఆత్మహత్యలు, కోర్టు ఆదేశాలను వివరించారు. ప్రభుత్వానికి తగిన సూచనలు చేసి.. సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు అఖిలపక్ష నేతలు తెలిపారు. ఆర్టీసీ విషయంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని గవర్నర్ తమిళిసై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని అన్నారు..
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సీపీఐ నేత కూనంనేని సాంబశివరావుతో దీక్ష విరమింప జేశారు అఖిలపక్ష నేతలు. నిమ్స్ ఆస్పత్రిలో ఉన్న ఆయనకు నిమ్మరసం అందించారు.. ప్రభుత్వం స్పందించకపోతే.. ఆర్టీసీ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనే అంశంపై ఆలోచిస్తానన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆర్టీసీ జేఏసీ నేతలు ఆయన్ను కలిసి మద్దతు కోరారు. సీఎం కేసీఆర్ 48 వేల మంది కార్మికులను దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు పవన్. త్వరలోనే కేసీఆర్ అపాయింట్మెంట్ కోరాతానన్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులను సైతం కలిసి ఆర్టీసీ సమ్మెపై చర్చిస్తానని చెప్పారు..
నవంబర్ 2న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఆర్టీసీ భవిష్యత్పైనే ప్రధానంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 3 నుంచి 4 వేల రూట్లలో ప్రైవేట్ వాహనాలకు పర్మిట్ ఇవ్వడంపై ఇప్పటికే కసరత్తు చేసిన నేపథ్యంలో దీనికి మంత్రివర్గం ఆమోదముద్ర వేస్తుందా.. లేదంటే వేచి చూస్తారా అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఆర్టీసీ సమ్మె ఎపిసోడ్లో మళ్లీ చర్చలు ఎప్పుడు ఉంటాయి.. హైకోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుంది.. ఒకవేళ ఈ కేసుపై సుప్రీంకి వెళ్తే పరిస్థితి ఏంటి అనే దానిపై రకరకాల వార్తలొస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com