కార్మికుల ఆత్మహత్యలపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు

ఏపీలో కొత్త ఇసుక విధానం, భవనకార్మికుల ఆత్మహత్యలపై తీవ్రంగా స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇసుక కొరత కారణంగా ఉపాధి కోల్పోయిన బాధితులతో గుంటూరులోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ సర్కారు కావాలనే ఇసుక కొరతను సృష్టించిందని... అసమర్ధ ఇసుక విధానం వల్ల.. రాష్ట్రంలో ఐదుగురు భవన కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు చంద్రబాబు..

ఆత్మహత్య చేసుకున్న భవనకార్మికుల కుటుంబాలతో మాట్లాడించారు చంద్రబాబు. గత ఐదు నెలలుగా ఇసుక కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు తమను పోషించే వ్యక్తే ఆత్మహత్య చేసుకోవడంతో.. రోడ్డున పడ్డామన్నారు బాధితులు. ఇప్పటికైనా ప్రభుత్వం... ఇసుక కొరత లేకుండా చేయాలని, తమకు పనులు కల్పించాలని కోరారు..

భవనకార్మికుల ఆత్మహత్యలపై మంత్రుల వ్యాఖ్యలు హేళనగా ఉన్నాయన్నారు. కాలం చెల్లి చనిపోయారంటూ మంత్రి అవహేళగా మాట్లాడుతారా అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో కావాలనే కృత్రిమ ఇసుక కొరత సృష్టించి.. పక్క రాష్ట్రాలకు ఇసుకను తరలిస్తున్నారన్నారు. ఓ వైపు ఇసుకే కరవయిందని భవనకార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇసుకవారోత్సవాలు నిర్వహిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు..

ఇసుక మాఫియాను అరికట్టేంతవరకు పోరాడుతామన్నారు చంద్రబాబు. బాధితుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి తాము అండగా ఉంటామన్న ఆయన.. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున చెక్కును అందజేశారు. ఇక.. ఇసుకకొరతపై పోరాటం చేసే పార్టీలకు మద్దతిస్తామన్నారు. పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన ర్యాలీకి మద్దతిస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు. ఈ ర్యాలీలో టీడీపీ సీనియర్‌ నేతలు పాల్గొంటారన్నారు..

మీడియాను నియంత్రించేందుకు ప్రభుత్వం తెచ్చిన 2430 జీవోపై మండిపడ్డారు చంద్రబాబు. ఎవరూ ఇలాంటి జీవో ఇచ్చే ధైర్యం ఏ ప్రభుత్వం చేయలేదన్న ఆయన.. తక్షణమే దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags

Next Story