రైల్లో ప్రయాణం.. సమస్య వచ్చినప్పుడు సంప్రదించాల్సిన నెంబర్లు..

రైళ్లలో ప్రయాణించే వారి కోసం ఇండియన్ రైల్వేస్ వివిధ రకాల సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రయాణీకుల భద్రత కోసం రైల్వే శాఖ అనేక చర్యలు చేపట్టింది. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణీకులు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కుంటారు. ఆ సమయంలో ఎవరిని సంప్రదించాలో అర్థం కాదు. కొన్ని రకాల సమస్యలు వచ్చినప్పుడు కొన్ని నెంబర్లకు ఫోన్ చేయడం ద్వారా వెంటనే సహాయం పొందవచ్చు. ఏ సహాయానికి ఏ నెంబర్‌కు ఫోన్ చేయాలో తెలుసుకుంటే మంచింది.
రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా వేధించినా, దొంగతనం జరిగినా వెంటనే 182కు ఫోన్ చేయాలి. మీ ప్రయాణానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తే తరువాతి స్టేషన్లో రైల్వే పోలీసులు సిద్ధంగా ఉంటారు. ఫిర్యాదు స్వీకరించి తగిన చర్యలు తీసుకుంటారు. 182 మరియు 1800-111-322 రైల్వేస్ సెక్యూరిటీ హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్లు. ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది.
ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు 138 నెంబర్‌కు ఫోన్ చేయాలి. అత్యవసర వైద్య సహాయం కోసం వెంటనే రైల్లోని టీసీలకు సమాచారం అందిస్తారు. వైద్యులు తరువాతి స్టేషన్లో వేచి వుంటారు. ఒకవేళ స్టాప్ లేకపోయినా వైద్యం కోసం రైలు ఆపడం జరుగుతుంది.
మహిళల కోసం ప్రత్యేకంగా 1091 కేటాయించారు. ప్రయాణంలో వారికి ఎలాంటి సమస్య వచ్చినా ఈ నెంబర్‌కు కాల్ చేస్తే సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు రైల్వే అధికారులు.
చిన్నారులకు సంబంధించి ఎలాంటి వైద్య సేవలు కావాలన్నా 1098కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు.
ఎమర్జెన్సీ సమయంలో 1072 ఇది రైల్వే యాక్సిడెంట్ ఎమర్జెన్సీ సర్వీస్ నెంబర్. రైలు ప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే ఈ నెంబర్‌కు కాల్ చేయాలి. బాధితులకు సాయం అందించేందుకు రైల్వే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంటారు.
మీరు ఎక్కిన కోచ్ శుభ్రంగా లేకపోయినా.. రైల్లో అందిస్తున్న భోజనం బాగలేకపోయినా.. ప్రయాణిస్తున్న బోగీలు అపరిశుభ్రంగా కనిపించినా లేదా బోగీలో సౌకర్యాలు బాగా లేకున్నా 58888 ఫిర్యాదు చేసే వెసులు బాటు ఉంది. ఈ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్ చేయాలి. దీనికి టోల్ ఫ్రీ నెంబర్ 1800-111-321. ఈ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. రిజర్వేషన్ సమాచారం కోసం 139 కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com