కర్నూలు జిల్లా నిండా నదులే.. కానీ తాగేందుకు లేవు..

కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురిస్తే చాలు ఆ నీరంతా టీబీ డ్యాం ద్వారా దిగువన ఉన్న తుంగభద్ర నదిలోకి వచ్చేస్తుంది. అలా వచ్చిన వరద నీరంతా తుంగభద్ర నది నుంచి శ్రీశైలం డ్యాంలోకి వెళుతుంది. అలా వెళ్లిన వరద నీరు శ్రీశైలం నుంచి దిగువన ఉన్న నాగార్జున సాగర్ జలాశయానికి చేరుతుంది. తుంగభద్ర నదికి జూరాల ప్రాజెక్టు నుంచి కూడ వరదనీరు వస్తుంది. అయితే.. తుంగభద్రకు ఎంత వరద నీరు వచ్చినా శ్రీశైలం ,నాగార్జున సాగర్ జలాశయాలకే చేరుతోంది. నీరు నిల్వ ఉంచుకునేందుకు పెద్ద జలాశయాలు ఏమీ లేకపోవడంతో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగు-తాగు నీటి కష్టాలు తప్పడం లేదు.
చూసే వారికి కర్నూలు జిల్లా నిండా నదులే నిపిస్తాయి కాని పెద్ద పెద్ద జలాశయాలు కనిపించవు. తుంగభద్ర నుంచి పెద్ద ఎత్తున వచ్చే వరద నీరు ముందుగా సుంకేసుల డ్యాంకు చేరుతుంది. అయితే.. సుంకేసుల డ్యాం నీటి నిల్వ సామర్ధ్యం 1.2 టీఎంసీలే కావడంతో పెద్ద ఎత్తున నీరు నిల్వ చేసుకునే అవకాశం లేకుండా పోతోంది. ఈ సుంకేసుల డ్యాంలోని నీరు కేవలం కేసీకెనాల్ ఆయకట్టుకు సాగునీరు, కర్నూలు ప్రజలకు తాగునీరు అందించడానికి మాత్రమే సరిపోతుంది.
శ్రీశైలం ప్రాజెక్ట్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, తెలుగు గంగ, శ్రీశైలం కుడిగట్టు కాలువ నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఉండడంతో అక్కడ సాగు, తాగు నీటికి పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయితే.. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 నియోజకవర్గాలలో మాత్రం నీటి కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. వృధాగా దిగువకు పోతోన్న తుంగభద్ర జలాలను నిల్వ చేసుకునే లక్ష్యంతో 20టిఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో నిర్మించాలనుకున్న గండ్రావుల రిజర్వాయర్ పనులు ప్రతిపాదనలు దాటి ముందుకెళ్లడం లేదు. మరోవైపు ..సిద్దేశ్వరం అలుగు నిర్మాణం ఊసే లేదు. దీంతో.. తుంగభద్రకు సమృద్దిగా పైనుంచి వరద నీరు వస్తున్నానిల్వ చేసుకుని వాడుకునే పరిష్థితి లేకుండా పోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com