బాగ్దాదీపై జరిగిన సైనిక ఆపరేషన్ వీడియో విడుదల చేసిన అమెరికా

బాగ్దాదీపై జరిగిన సైనిక ఆపరేషన్ వీడియో విడుదల చేసిన అమెరికా

isisi

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబు బకర్‌ అల్‌ బాగ్దాదీని అంతం చేసిన అమెరికా సైనిక ఆపరేషన్‌కి సంబంధించిన వీడియోను అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ విడుదల చేసింది. ఈ వీడియోలో అమెరికా ప్రత్యేక బలగాలు బాగ్దాదీ ఉన్న ఇంటిని చుట్టూముడుతున్న దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి. అమెరికా బలగాలు కిందకి దిగడానికి ముందే హెలికాప్టర్లపైకి తీవ్రవాదులు కాల్పులు జరిపిన దృశ్యాలు కూడా ఇందులో ఉన్నాయి.

అమెరికా సెంట్రల్‌ కమాండ్ కమాండర్‌ కెన్నెత్‌ మెకంజీ దాడికి సంబంధించిన వివరాలను మీడియకు వెల్లడించారు. బాగ్దాదీని మట్టుబెట్టిన తర్వాత ఇంటిని పూర్తిగా నేలమట్టం చేసినట్లు తెలిపారు. అలాగే అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించినట్లు బాగ్దాదీ తనకు తాను పేల్చుకున్న సమయంలో అతడి ముగ్గురు పిల్లలు చనిపోలేదని ఇద్దరు మాత్రమే మృతి చెందారన్నారు. చనిపోయిన ఇద్దరూ 12 ఏళ్ల లోపు వారేనని తెలిపారు. ఈ ఘటనలో నలుగురు మహిళలు, ఓ పురుషుడు కూడా మృతిచెందినట్టు తెలిపారు.

ఆపరేషన్ జరిగిన సమయంలో ప్రాణాలతో పట్టుబడ్డ ఇద్దరు ఉగ్రవాదుల గురించి అమెరికా ఎలాంటి సమాచారం బయటపెట్టలేదు. ఇంట్లో ఐసిస్‌ కార్యకలాపాలకు సంబంధించిన పలు ఎలక్ట్రానిక్‌, డాక్యుమెంట్ల రూపంలో ఉన్న ఆధారాలు సేకరించినట్టు మాత్రం తెలిపారు. బాగ్దాదీ 2004లో ఇరాక్‌ జైల్లో ఉన్న సమయంలోనే అతని డీఎన్‌ఏ ఆధారాలు సేకరించామని.. వాటి ఆధారంగానే తాజాగా మృతిచెందింది అతడేనని నిర్దారించినట్టు తెలిపారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం అతడి మృతదేహాన్ని 24గంటల్లో సముద్రంలో ఖననం చేసినట్టు అమెరికా ప్రకటించింది.

చివరి క్షణాల్లో బాగ్దాదీని వెంబడించిన జాగిలం వివరాలను కూడా వెల్లడించారు. నాలుగేళ్ల వయసున్న ఈ జాగిలం ఇప్పటి వరకు 50దాడుల్లో పాల్గొన్నట్లు అమెరికా తెలిపింది. దాడిలో స్వల్పంగా గాయపడినప్పటికీ.. వెంటనే కోలుకొని విధుల్లో చేరిందట. అయితే పేరు మాత్రం బయటకు చెప్పలేమన్నారు.

Tags

Read MoreRead Less
Next Story