ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం


విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంధ్రా సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషన్, స్పీకర్ తమ్మినేని సీతారామ్, సీఎం జగన్, పలువురు మంత్రులు హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్. పల్లవులు, చాళుక్యులు, శాతవాహనులు పాలించిన గొప్పనేల ఈ రాష్ట్రమని కొనియాడారు. స్వాతంత్రోద్యమంలో ఈ ప్రాంత నేతలు గొప్పపోరాటం చేశారని అన్నారు. భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలిరాష్ట్రంగా ఏపీకి ప్రత్యేక గుర్తింపు ఉందని గవర్నర్ చెప్పారు.
ఐదేళ్ల తర్వాత రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకోవడం గర్వకారణంగా ఉందని చెప్పారు సీఎం జగన్. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత దగా పడలేదన్నారు. పదేళ్లుగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకోవాల్సిన అవసరముందన్నారు. భవిష్యత్ తరాలు బాగుపడేలా నవరత్నాల పథకాలను అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు బాగుపడేలా కార్యాచరణ అమలు చేస్తున్నట్లు వివరించారు. కష్టాల తర్వాత మంచి రోజులు కూడా వస్తాయని నిరూపించుకుందామని అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో అందరూ కలిసి రావాలని కోరుతున్నామని జగన్ పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

