అమిత్ షా మధ్యవర్తిత్వం అవసరం లేదు: శివసేన


మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. శివసేన ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకో ప్రకటనతో మహా రాజకీయం రసవత్తరంగా మారింది. సీఎం పదవిపై రాజీపడేది లేదంటున్న శివసేన.. తమ పార్టీ వ్యక్తి సీఎం కావాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేసింది. అంతే కాదు అమిత్ షా మధ్యవర్తిత్వం అవసరం లేదని తేల్చి చెప్పింది.
బీజేపీకి తాము అల్టిమేటం ఇస్తున్నామన్న వార్తలపై కూడా శివసేన స్పందించింది. ఎవరికి అల్టిమేటం ఇవ్వడం లేదని.. తాము సాధారణ ప్రజలమని తెలిపింది. బీజేపీ ఇంటర్నేషనల్ పార్టీ అని ఎద్దేవా చేసింది. సీఎం పీఠంపై ఇటు శివసేన, అటు బీజేపీ మెట్టుదిగకపోవడంతో మహా రాజకీయం అనేక మలుపులు తిరుగుతోంది.
బీజేపీ తమ డిమాండ్లకు ఒప్పుకోకపోవడంతో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో టచ్‌లో ఉంటోంది శివసేన. ఎన్సీపీ, కాంగ్రెస్ కూడా శివసేనకు మద్దతు తెలిపేందుకు సై అంటున్నాయి. ఇప్పటికే రెండు సార్లు గవర్నర్‌ను కలిసిన శివసేన బృందం.. రైతు సమస్యలపై మాత్రమే కలిశామని చెబుతోంది. ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు. బీజేపీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా చెబుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

