ఫ్రెండ్‌ని బతికించుకునేందుకు జోలె పట్టిన స్నేహితులు

తోటి స్నేహితుడికి అనుకోని రోగం వచ్చింది. వైద్యానికి భారీగా నగదు వెచ్చించాల్సి రావడంతో కుటుంబ సభ్యులు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అంతే.. తమ క్లోజ్‌ ఫ్రెండ్‌ని బతికించుకునేందుకు స్నేహితులంతా జోలె పట్టారు. అతణ్ణి ఎలాగైనా కాపాడుకోవాలని ఇంటింటికి తిరిగి నగదు సాయం చేయాలని వేడుకుంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా దాతల సాయం కోసం ఆర్ధిస్తున్నారు.

నెల్లూరు జిల్లా అనంతసాగరానికి చెందిన అల్లీ ఇమామ్‌షా, కాలేబీలకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు షేక్‌ ఖాజావలీ పదో తరగతి వరకు చదువుకున్నాడు. కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో చదువు మానేసి సెంట్రింగ్‌ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంతలో ఖాజావలీకి ప్రాణాంతకమైన బోన్‌ మ్యారో వ్యాధి సోకింది. వైద్యులను సంప్రదిస్తే.. ట్రీట్‌మెంట్‌కి 25 లక్షలకుపైగా ఖర్చవుతుందని చెప్పడంతో కుటుంబ సభ్యులు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ప్రస్తుతం ఖాజావలీ తమిళనాడులోని వేలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన చికిత్సకు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. తమ ఒక్కగానొక్క కోడుకుకి ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధి రావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.

స్నేహితుడి ప్రాణాలను కాపాడుకునేందుకు స్నేహితులందరూ మాట్లాడుకోని ఒక్కటై జోలె పట్టారు. నాలుగు రోజులుగా ఇంటింటికి తిరిగి సాయం అందించాలని వేడుకుంటున్నారు. ఇప్పటి వరకు సుమారు 5 లక్షల వరకు పోగు చేశారు. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి సహాయం చేయాలని అర్థిస్తున్నారు.

ఈ మధ్యనే రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితి నుండి బయటపడిన షేక్ రఫీ కూడా.. తన చికిత్సకు పోను మిగిలిన డబ్బుల్లో నుంచికొంత సాయం చేశాడు. షేక్‌ ఖాజావలీకి ఎవరైనా సాయం చేయాలనుకుంటే 77994 47137, 9676 517112 నంబర్లలో సంప్రదించాలని అతని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Tags

Next Story