రాష్ట్రపతి పాలన వైపుగా.. 'మహా'రాజకీయం

రాష్ట్రపతి పాలన వైపుగా.. మహారాజకీయం
X

Maharastra

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 9రోజులు అయింది. ఇంకా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు జరగలేదు. సీఎం పదవి మాకంటే మాకని బీజేపీ-శివసేన పార్టీలు దోబూచులాడుతున్నాయి. ఇరుపార్టీల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు గడువు ముంచుకొస్తోంది. ఇంకా ఆలస్యం చేస్తే పరిస్థితులు చేజారిపోతాయి. చివరకు రాష్ట్రపతి పాలన వస్తుందని నిపుణులంటున్నారు.

ప్రస్తుతం మహారాష్ట్రలో నాటకీయ పరిణామాలు చూస్తుంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెల ఏడులోగా ప్రభుత్వం ఏర్పాటు జరగకపోతే రాష్ట్రపతి పాలన విధిస్తారని బీజేపీ ముఖ్యనేత, ఆర్థిక మంత్రి సుధీర్‌ ముంగంటివార్‌ ఇప్పటికే ప్రకటించారు. నవంబరు 9వ తేదీతో పాత శాసనసభ కాలపరిమితి ముగిసిపోతుంది. ఆలోగా కొత్త శాసనసభ కొలువుదీరాలి. అక్టోబరు 21న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, 23న ఫలితాలు వెలువడ్డాయి.

ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి ఈ నెల 8వ తేదీన ముగియబోతోంది. ఈ లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. లేదంటే గవర్నర్ భగత్ సింగ్ కోషియార్ చేతికి వెళుతుంది. ఆయన విచక్షణ ఆధారంగా రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది. ముందుగా అతిపెద్ద పార్టీని ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పిలిచే అవకాశం ఉంది. నిర్ణీత గడువులోగా ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే.. రెండో అతిపెద్ద పార్టీకి అవకాశం ఇస్తారు. ఈ ప్రయత్నాలు విఫలం అయితే.. అప్పుడు రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేస్తారు.

బీజేపీ, శివసేన కూటమికి సాధారణ మెజారిటీ వచ్చినప్పటికీ సీఎం పదవిని పంచుకొనే విషయమై బీజేపీ స్పష్టమైన హామీ ఇవ్వనందున ప్రభుత్వంలో చేరేందుకు శివసేన నిరాకరించింది. దీంతో 9రోజులుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. శివసేన దిగొస్తే లేదా ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం ద్వారా సాధారణ మెజారిటీ సమకూరితే ఈ నెల ఐదో తేదీన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ తో ప్రమాణ స్వీకారం చేయించాలని బీజేపీ భావిస్తోంది. అది సాధ్యం కాకపోతే ఏడున రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశాలుంటాయి.

అటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమవుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉంది. శివసేన- బీజేపీ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్సీసీ మద్దతు కోసం బీజేపీ, శివసేనలు ప్రయత్నిస్తున్నాయి. అయితే శరద్ పవార్ మాత్రం వారికి మద్దతిచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. పొత్తు పెట్టుకుని పోటీచేసిన కాంగ్రెస్- ఎన్సీపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తాయన్నది ఆసక్తిగా మారింది.

Tags

Next Story