పూట గడవని స్థితిలో నెల్లూరు భవన నిర్మాణ కార్మికులు

పూట గడవని స్థితిలో నెల్లూరు భవన నిర్మాణ కార్మికులు
X

nlr-sand

ఇసుక కొరత ఏపీలో కల్లోలం రేపుతోంది. ఇసుక కొరత కారణంగా నెల్లూరు జిల్లాలో వేలాదిగా భవన నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాటిపై ఆధారపడ్డ కార్మికుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు, బేల్దారీ పనులపై ఆధారపడి జీవిస్తున్నవారు సుమారు 2 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు వీరందరికి జీవనోపాధి లేక రోడ్డున పడ్డారు.

నెల్లూరు నగరానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని కూలీలంతా ప్రతి రోజూ ఉదయం 6 గంటలకే నగరానికి చేరుకుంటారు. ప్రతి రోజూ ఆయా సెంటర్లకు వచ్చి ఉంటారు. ఎవరైనా భవన నిర్మాణాలకు అవసరమైన వారు, ఇతర మేస్త్రీలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బిల్డర్లు వారిని పనులకు తీసుకెళుతుంటారు. ఇలా గత 20, 30 ఏళ్లుగా ఆయా సెంటర్లే ఆ కూలీలకు అడ్డాలు. అక్కడికి వస్తే ఎప్పుడైనా పని దొరుకుతుందన్నది వారి నమ్మకం. గత కొంత కాలంగా జిల్లాలో ఇసుక రవాణా ఆగిపోవడంతో.. ప్రస్తుతం వీరంతా రోజువారి కూలీ పనుల కోసం గంటల తరబడి రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. నేడు వారి పరిస్థితి హృదయవిదారకం. రోజువారీ కూలీ డబ్బులతోనే నాలుగు వేళ్లు నోట్లోకి పోవాలి. ఆ డబ్బుతోనే ఇంటి అద్దె, కొండెక్కిన నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనాలి. ఏ రోజుకారోజు పనికెళితే తప్ప పూట గడవని పరిస్థితి.

వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంపై ఆ ప్రభావం పడడంతోపాటు.. చేపట్టిన నిర్మాణాలు శ్లాబు దశల్లోనే నిలిచిపోవడంతో పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమౌతుంది. ఇసుక లభించకపోవడంతో ఆ ప్రభావం ఇళ్లు, భవన నిర్మాణాలపై పడింది. ఇప్పటికే వాటి నిర్మాణం చేపట్టిన వారు తాత్కాలికంగా నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్పందన కార్యక్రమానికి ఇసుక అనుమతుల కోసం అనేక మంది వస్తున్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం, కార్మికులు, ట్రాక్టర్ల యజమానులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాలతో ట్రాక్టర్లు తీసుకున్నవారూ.. ఇసుక రవాణాకు, తవ్వకాలకు అనుమతులివ్వాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.

జిల్లాలోని ఇసుక రేవుల నుంచి కొందరు అక్రమ మార్గాన ఇసుకను తీసుకొచ్చి ఓ ఎడ్లబండిని 2 నుంచి 3 వేలకు విక్రయిస్తున్నారు. ఒక ట్రాక్టరు ఇసుకైతే ఏకంగా వినియోగదారుడి అవసరాన్నిబట్టి 4 నుంచి 6 వేల వరకూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు అయితే ఏకంగా ఇసుకను దర్జాగా సరిహద్దులు దాటించేస్తున్నారు. ఇసుక రేవు ప్రక్కన ఉన్న వారికి సైతం ఇసుక దొరకని పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. రేవుల్లో సులువుగా అతి తక్కువ మొత్తానికే దొరికేది. ప్రభుత్వ ఆదేశం మేరకు ఆంక్షలు పెట్టడంతో.. జిల్లాలో డిమాండ్‌ బాగా పెరిగింది. దీన్ని సొమ్ము చేసుకొనేందుకు శాండ్‌ మాఫియా దొంగచాటుగా ఇసుకను తరలిస్తూ.. పెద్ద మొత్తానికి విక్రయిస్తుండటంతో.. ఆ భారం నిర్మాణ వ్యయంపై పడుతుందని సొంత నివాసాలు నిర్మించుకునేవారు వాపోతున్నారు.

Tags

Next Story