కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలుస్తాం : ఆర్టీసీ జేఏసి

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలుస్తాం : ఆర్టీసీ జేఏసి

aswaddhamareddy

ఆర్టీసీ సమ్మెపై తుది వరకు పోరాడేందుకు సిద్ధమైంది ఆర్టీసీ జేఏసీ. విద్యానగర్‌లోని ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆఫీస్‌లో ఆర్టీసీ జేఏసీ, విపక్ష నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్‌ కార్యచరణపై సమగ్రంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 3న అన్ని డిపోల వద్ద, గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. 4న రాజకీయ పార్టీలతో డిపోల దగ్గర దీక్ష, 5న రహదారుల దిగ్బంధం, 6న డిపోల ముందు నిరసన, 7న ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులు, రాజకీయ పార్టీలతో డిపోల ముందు దీక్ష, 8న ఛలో ట్యాంక్ బండ్ సన్నాహక కార్యక్రమాలు, 9న ట్యాంక్ బండ్‌పై దీక్ష, నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.

ఆర్టీసీ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని, సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు నేతలు. రూట్లను వేరుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ నెల 4 లేదా 5 వ తేదీలలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలుస్తామన్నారు..

అటు రాజకీయ పార్టీలు సైతం.. ఆర్టీసీ సమ్మెను ఉద్ధృతం చేస్తామన్నాయి. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం చర్చలకు దిగిరావాల్సిందేనన్నారు పార్టీల నేతలు. మొత్తానికి... ఆర్టీసీ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు... అటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేయాలని నిర్ణయించారు ఆర్టీసీ, రాజకీయ జేఏసీ నేతలు.

Tags

Next Story