కర్ణాటకలో టిప్పు తుఫాన్..

టిప్పు సుల్తాన్ జయంతిని జరపబోమని ఆయన పేరిట ఉన్న పాఠ్యాంశాలను తొలగిస్తామని గతంలోనే తేల్చిచెప్పారు యడియూరప్ప. పైగా టిప్పు సుల్తాన్ స్వాతంత్ర్య సమరయోధుడన్న వాదనతో తాను ఏకీభవించనని అన్నారు. అందుకే నవంబర్ 10న టిప్పు సుల్తాన్ జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా జరపకూడదని భావించినట్లు యడియూరప్ప చెప్పారు. బలవంతపు మతమార్పిళ్లు, హిందువులను వేధించడం, దేవాలయాల కూల్చివేత వంటి చర్యలకు పాల్పడి వివాదాస్పదమైన పాలకుడిగా పేరు తెచ్చుకున్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు యడియూరప్ప. కాని ఇప్పుడీ స్టేట్ మెంట్ పై విపక్షాలు మండిపడుతున్నాయి. పాఠ్యపుస్తకాల్లో టిప్పు సుల్తాన్ జీవిత చరిత్రను కొనసాగించాలని పట్టుబడుతోంది కాంగ్రెస్.
కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత 2015 నుంచి టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోంది. ఏటా నవంబర్ 10న వీటిని జరిపేవారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాని ఇప్పుడు బీజేపీ సర్కారు పవర్ లోకి వచ్చింది. అందుకే నిర్ణయం మారింది. మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ హిందూ వ్యతిరేకి అని కమలదళం మొదటి నుంచీ వాదిస్తోంది. అందుకే దానికి తగ్గట్టుగానే ఇప్పుడు టిప్పు జయంతి ఉత్సవాలను రద్దు చేసింది. ఈ ఏడాది జూలైలో యడ్డీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోపే ఉత్సవాల రద్దు గురించి ప్రకటించింది. ఇప్పుడీ నిర్ణయంపై ఉత్తర కర్ణాటక జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
టిప్పు సుల్తాన్ పాఠాలను చరిత్ర పుస్తకాల నుంచి తొలగించాలని బీజేపీకి చెందిన ఎమ్మెల్యే అప్పచ్చు రంజన్ యడ్డీ ప్రభుత్వానానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఆ రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి సురేశ్ కుమార్ దీనిపై స్పందించారు. పాఠ్యపుస్తకాల నుంచి టిప్పు సుల్తాన్ కు సంబంధించిన పాఠాలను తొలగించే విషయమై లేఖ కూడా రాశారు. కర్ణాటక రాష్ట్ర పాఠ్యపుస్తకాల డ్రాఫ్టింగ్ సొసైటీకి ఈ లెటర్ ను రాశారు. దీనిపై మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే అప్పచ్చు రంజన్ తో మూడు రోజుల్లోగా సమావేశమై చర్చించాలని సొసైటీ ఎండీని ఆదేశించారు. దీంతో టిప్పు సుల్తాన్ పాఠాలను తొలగించే విషయంలో యడ్డీ సర్కార్ స్పీడును పెంచినట్లయింది. కానీ ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై గట్టిగానే పోరాడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com