జనసేన లాంగ్ మార్చ్.. పాల్గొనే టీడీపీ నేతలు వీరే..

రాష్ట్రంలో ఇసుక సంక్షోభంపై కాసేపట్లో జనసేన లాంగ్ మార్చ్ నిర్వహించనుంది. మార్చ్‌లో పాల్గొనేందుకు విశాఖ బయలుదేరారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మధ్యాహ్నం మూడు గంటలకు మద్దిలపాలెం జంక్షన్ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలో ప్రారంభం కానున్న లాంగ్ మార్చ్... రామాటాకీస్, ఆశిల్ మెట్ట జంక్షన్ మీదుగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకు కొనసాగనుంది. దాదాపు రెండున్నర కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ తీయనున్నారు. వివిధ జిల్లాల నుంచి జనసేన కార్యకర్తలు, భవన నిర్మణ కార్మికులు విశాఖకు భారీగా తరలివస్తున్నారు.
ర్యాలీ అనంతరం స్థానిక మహిళా డిగ్రీ కాలేజీలో భారీ బహిరంగ సభ జరగనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భవన నిర్మాణ కార్మికులు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వేదిక వద్దకు ప్రజలు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే మార్చ్‌కు టీడీపీ మద్దతు ప్రకటించడంతో... టీడీపీ శ్రేణులు కూడా విశాఖకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. లాంగ్ మార్చ్‌లో టీడీపీ నేతలు చింతకాలయ అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు పాల్గొంటారు.
అయితే మార్చ్‌లో పాల్గొనబోమని తెలిపిన బీజేపీ, వామపక్షాలు.. సంఘీభావం మాత్రం ప్రకటించాయి. భవన నిర్మాణ కార్మికులు ఐదు నెలలుగా ఉపాధి కరవై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారికి అండగా నిలవడానికే జనసేన ఈ కార్యక్రమం చేపట్టిందని జనసేన నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన మార్చ్‌ను విజయవంతం చేసి తీరుతామని అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com