పోలీసులు, లాయర్లు మధ్య వివాదం : కోర్టులోనే ఘర్షణ.. చివరకు ఇలా..

ఢిల్లీలో ఓ చిన్న వివాదం పోలీసులు, లాయర్ల మధ్య చిచ్చు పెట్టింది. ఏకంగా కోర్టు ఆవరణలోనే ఇరువర్గాలూ కలబడి కొట్టుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఓ పోలీస్ జీప్‌కు నిప్పు పెట్టారు. 20 మంది గాయపడ్డారు. పార్కింగ్ విషయంలో గొడవే ఈ వివాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ కొట్లాటతో తీస్‌హజారి కోర్టు పరిసర ప్రాంతాల్లో కాసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది..

3వ బెటాలియన్‌కు చెందిన పోలీసులు ముందుగా తమపై దాడికి దిగారన్నది లాయర్ల ఆరోపణ. తమపై కాల్పులు కూడా జరిపారని చెప్తున్నారు. బుల్లెట్ గాయమైన అడ్వొకేట్ విజయ్ వర్మ ప్రస్తుతం సెయింట్ స్టీఫెన్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని ఢిల్లీ బార్ కౌన్సిల్ ప్రకటించింది. అకారణంగా దాడికి దిగిన వారిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ దాడికి నిరసనగా సోమవారం విధులు బహిష్కరిస్తున్నట్టు చెప్పారు.

అటు, ఈ ఘటనపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అత్యవసర సమీక్ష చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి అసలు ఏం జరిగిందో తేల్చాలని ఆదేశించారు. జాయింట్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలోని సిట్ టీమ్.. ఇప్పటికే రంగంలోకి దిగింది. ఇవాళ కూడా జడ్జిల బృందం పోలీస్ కమిషనర్‌తో సమావేశం కానున్న నేపథ్యంలో.. వివాదానికి కారణాలేంటనే దానిపై అప్పటికల్లా ప్రాధమిక నివేదిక అందచేయనున్నారు. పోలీసుల దురుసు ప్రవర్తనపై కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.

తీస్ హజారీ కోర్టు కాంప్లెస్‌లో జరిగిన ఘర్షణలో ఓ డీసీపీతోపాటు 20 మంది పోలీసులకు గాయాలయ్యాయంటున్నారు. 8 మంది అడ్వొకేట్లు కూడా గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఓ జీప్ దగ్దమవగా.. 12 బైక్‌లు, కొన్ని జైలు వ్యాన్‌లు కూడా ధ్వంసం అయ్యాయి.

Tags

Next Story