ఎమ్మార్వో హత్యను ఖండించిన రెవెన్యూ సంఘాలు

తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆఫీసులోనే ఎమ్మార్వోను తగలబెట్టడం ప్రకంపనలు సృష్టించింది. పార్టీలు, ప్రజాసంఘాలు, రెవెన్యూ సంఘాలు ఎమ్మార్వో హత్యను ఖండించాయి. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. విజయారెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురిని అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని వాపోయారు.
విజయారెడ్డి హత్యోదంతం నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతాన్ని రౌండప్ చేశారు. క్లూస్ టీం సాయంతో వివరాలు సేకరించారు. దాడికి దారి తీసిన పరిస్థితులు, ఎమ్మార్వో చాంబర్‌లో ఏం జరిగిందో ఆరా తీస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే సీపీ మహేష్ భగత్, ఘటనా స్థలికి వెళ్లి విచారణ చేపట్టారు. ఘటనకు దారి తీసిన పరిణామాలపై ప్రాథమిక సమాచారం సేకరించారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. భూవివాదమే తహసీల్దార్ హత్యకు కారణమని సీపీ మహేష్ భగత్ తెలిపారు.
ఎమ్మార్వో విజయ సజీవదహనంపై రాజకీయ పార్టీలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశాయి. ప్రభుత్వం కూడా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘటనా స్థలికి వెళ్లి అధికారులతో మాట్లాడారు. దోషులకు కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com