ఆర్టీసీ కార్మికులకు డెడ్‌లైన్ గంటలే.. విధుల్లో చేరకుంటే..
ఆర్టీసీ కార్మికులకు సర్కార్ ఇచ్చిన డెడ్‌లైన్ మరికొన్ని గంటలే మిగిలి ఉంది. ఈ అర్థరాత్రిలోగా విధుల్లో చేరని కార్మికులను ఇక ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాల్లోకి తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాదు మరిన్ని ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. మరీ మంగళవారం అర్థరాత్రిలోపు కార్మికులు విధుల్లో చేరుతారా? ఒక వేళ చేరకపోతే ప్రభుత్వ తదుపరి కార్యాచరణ ఏంటి?అన్నది ఉత్కంఠగా మారింది.
నిన్న మరోసారి ఆర్టీసీ సమ్మెపై ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. ఈ అర్థరాత్రిలోపు విధుల్లో చేరని కార్మికులను ఇక భవిష్యత్‌లో ఉద్యోగాల్లో తీసుకోవద్దని నిర్ణయించారు. కార్మికులు సమ్మె విరమించి రాకపోతే ఇక తెలంగాణలో ఆర్టీసీ ఉండదని ప్రకటించారు. అంతే కాదు మిగిలిన 5 వేల రూట్లలోనూ ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు ఇవ్వాలని భావిస్తున్నారు. అదే జరిగితే ఇక రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థకు మనుగడే లేకుండా పోతుందని.. ఉద్యోగాన్ని కాపాడుకోవడమా? లేక కుటుంబాలను ఇబ్బందుల పాలు చేయడమా అనేది కార్మికులే తేల్చుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆర్టీసీపై జరిగిన సమీక్ష సందర్భంగా కార్మిక చట్టాలు, కేంద్ర రవాణా చట్టాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. సమ్మెపై హైకోర్టులో అనుసరించాల్సిన వ్యూహాలపైనా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
హైకోర్టులో జరుగుతున్న విచారణను చూపి యూనియన్ నాయకులు కార్మికులను మభ్య పెడుతున్నారని సీఎం మండిపడ్డారు. కానీ న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సమ్మె విషయంలో కోర్టు ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం లేదన్నారు. ఒకవేళ కేసు సుప్రీంకోర్టుకు వెళితే.. అక్కడ విచారణ మరింత ఆలస్యమవుతుందని..అది అంతంలేని పోరాటం అవుతుందని అధికారులతో అన్నారు సీఎం కేసీఆర్.
ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని కార్మికులు ఉపయోగించుకోవాలని సూచించారు ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ. ప్రభుత్వం ఇచ్చిన గడువు లోగా విధుల్లో చేరాలనుకునే ఆర్టీసీ కార్మికులు తాము పనిచేస్తున్న డిపో మేనేజర్లకు జాయినింగ్ లెటర్స్ ఇవ్వవచ్చని తెలిపారు. హైదరాబాద్‌లో పనిచేసే కార్మికులు బస్ భవన్‌లో, ఈడి కార్యాలయాల్లో లేఖలు అందించవచ్చని సూచించారు. విధుల్లో చేరే కార్మికులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు సునీల్ శర్మ.
మరోవైపు విధుల్లో కార్మికులు ఎవరూ చేరరని అన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే సమ్మె విరమిస్తామని తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని చెప్పారు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com