ఆయన రాకకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం : ప్రధాని మోదీ

థాయ్‌లాండ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింగో అబేతో భేటీ అయ్యారు.. ద్వైపాక్షిక, భద్రత అంశాలపై వీరిద్దరూ సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై లోతుగా చర్చించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థాపన, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, పరస్పర సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సుకు హాజరైన మోదీ, అబే ఇరు దేశాల మధ్య సంబంధాలను ఏవిధంగా బలోపేతం చేయాలన్న దానిపై దృష్టి సారించారు. నాలుగు నెలల్లో ఇరు దేశాల ప్రధానుల మధ్య సమావేశం జరగడం ఇది మూడోసారి.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సైనికంగా, ఆర్థికంగా చైనా చేపడుతున్న విస్తరణ చర్యల అంశం ఇద్దరి మధ్యా చర్చకు వచ్చింది.. చైనా చర్యలను ఏ విధంగా ఎదుర్కోవాలన్నదానిపైనా మంతనాలు సాగించారు. అంతర్జాతీయ నియమ నిబంధనల ప్రకారం ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలన్న అంశంపై ఇరు దేశాల ప్రధానులు తమ వైఖరిని ఈ చర్చల సందర్భంగా పునరుద్ఘాటించారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. తృతీయ దేశాలు సహా ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని శాంతియుత పరిస్థితులతో విలసిల్లేలా చేయాలని ఈ సందర్భంగా మోదీ, అబే సంకల్పించినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో చైనా దుందుడుకు ధోరణిపై 10 దేశాల ఆసియాన్ కూటమిలో అలజడి రేగుతున్న నేపథ్యంలో భారత్-జపాన్ ప్రధానులు ఇదే అంశాన్ని కేంద్రీకరించి చర్చించడానికి ప్రాధాన్యం చేకూరింది. అలాగే, ఈ నెలాఖరులో భారత్‌లో పర్యటించనున్న ఇరు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖల అధికారులు తొలి సమావేశంపైనా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశం వల్ల భారత్-జపాన్ మధ్య రక్షణ, భద్రత సహకారానికి మరింత ఊతం లభిస్తుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
జపాన్ ప్రధానితో భేటీ తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.. షిండో అబే తనకు అత్యంత సన్నిహితమైన మిత్రుడని, ఆయనతో ఎప్పుడు చర్చలు జరిపినా అవి సుహృద్భావ రీతిలోనే సాగుతాయని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంతోపాటు అనేక అంశాలపై తమ మధ్య చర్చలు జరిగాయని మోదీ వివరించారు. వచ్చేనెలలో భారత్‌లో జరుగనున్న ఇండో-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి షిండో అబే రాకకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com