తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య జరిగిందిలా.!

తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య జరిగిందిలా.!
X

mro-vijaya-reddy

అది సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయం. అబ్దుల్లాపూర్‌ మెట్ తహసీల్దార్‌ కార్యాలయం. లంచ్‌ సమయం కావడంతో ఉద్యోగులంతా భోజనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలోనే ఎవరూ ఊహించని ఘటన. అందరూ నివ్వెరపోయేలా తహసీల్దార్‌ విజయారెడ్డి మంటల్లో కాలిపోతూ హాహాకారాలు పెట్టారు. సిబ్బంది కూడా ఏం జరుగుతుందో తెలియ అటు ఇటు పరుగులు పెట్టారు. అందరూ చూస్తుండగానే తహసీల్దార్‌ విజయారెడ్డి మంటల్లో కాలిపోయారు. ఈ ఘటనతో అక్కడున్నవారంత షాక్‌కు గురయ్యారు. ఆమెను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసీల్దార్ కార్యాలయం సోమవారం గ్రీవెన్స్ డే కావడంతో చాలా రద్దీగా ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హడావుడిగా వచ్చాడు సురేష్ అనే వ్యక్తి. ఓ సంచితో కార్యాలయంలోకి ప్రవేశించాడు. అప్పటికే లంచ్‌కు వెళ్దామని బయటకు వెళ్లిపోతున్న తహసీల్దార్‌ విజయారెడ్డి.. సురేష్‌ను చూసి ఆగింది. భూ వివాదం విషయంలో ఇద్దరి మధ్య అరగంటసేపు చర్చ జరిగింది. తహసీల్దార్‌తో మాట్లాడి... గదిలోంచి బయటకు వెళ్లిపోతున్నట్లు నటించిన సురేష్‌.. డోర్‌ లాక్‌ చేసి వెనక్కి వచ్చాడు. తన వెంట తెచ్చుకున్న బాటిల్‌లోని పెట్రోల్‌ను ఒక్కసారిగా విజయారెడ్డిపై పోశాడు. లైటర్‌తో నిప్పంటించాడు. దీంతో విజయారెడ్డి మంటల్లో కాలుతూ హాహాకారులు పెడుతూ బయటకు పరుగులు తీసింది. అయితే సురేష్‌ ఆమెను మళ్లీ వెనక్కి లాగాడు. ఈ క్రమంలోనే అతడికి మంటలు అంటుకున్నాయి. ఆ మంటలతోనే గదిలోంచి పరుగెత్తుకుంటూ బయటకు వచ్చేశాడు. అక్కడే ఉన్న డ్రైవర్ గురునాథం, అటెండర్‌ చంద్రయ్య విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారికి కూడా మంటలు అంటుకున్నాయి. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అప్పటికే అగ్నికీలల్లో కాలిపోతున్న విజయారెడ్డి.. కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేశారు. అందరూ చూస్తుండగానే సజీవ దహనం అయ్యారు.

ఊహించని ఘటనతో కార్యాలయ ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. కొద్దిసేపటి వరకు అసలక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. మంటల్లో కాలిపోతున్నది తహసీల్దార్‌ విజయారెడ్డి అనే విషయాన్ని మొదట ఎవరూ గుర్తించలేదు. మేడం ఎక్కడ.. మేడం ఎక్కడ అంటూ సిబ్బంది పరుగులు పెడుతుండటంతో కాలిపోతున్న విజయారెడ్డే చేయిపైకెత్తారు. అప్పడుగానీ వారికి విషయం అర్థం కాలేదు. ముందుగా సిబ్బంది అంతా గ్యాస్‌ సిలిండర్‌ ప్రమాదమని అనుకున్నారు. కానీ హత్య అని తేలడంతో ఉలిక్కిపడ్డారు. ఇక ఘటన జరిగి వెంటనే అబ్దుల్లాపూర్‌మెట్‌ కార్యాలయానికి రెవెన్యూ ఉద్యోగులు భారీగా చేరుకున్నారు. హత్యను ఖండిస్తూ నిరసనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

నిందితుడు సురేష్‌కు కూడా 60శాతానికిపైగానే గాయాలయ్యాయి. ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నారు. విజయారెడ్డి హత్యకు కారణం ఏంటి? అంతలా ఆమెపై సురేష్‌ పగ పెంచుకోవడానికి కారణం ఏంటి? అయితే భూ వివాదం విషయంలోనే దారుణానికి ఒటిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు తన కొడుకు మతిస్థిమితం లేదని.. ఈ హత్య ఎందుకు చేశాడో తెలియదని అంటున్నారు నిందితుడి తల్లిదండ్రులు.

ఈ ఘటనను ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో ఖండించాయి.పట్టపగలే ఒక మహిళా ఉద్యోగిని ఇంత క్రూరంగా హత్యచేయడం దారుణమని అన్నారు. ఇది చాలా హేయమైన చర్య అని.. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా..ఉద్యోగులకు పూర్తి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

విజయారెడ్డికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త హయత్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఈ దారుణ హత్యతో విజయారెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కూతురిని అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని వాపోయారు. వారిని ఓ దార్చడం ఎవరివల్లా కాలేదు. భర్త సుభాష్‌రెడ్డి శోక సంద్రంలో మునిగిపోయారు.స్పాట్..

మంగళవారం నాగోల్‌లోని స్మశాన వాటిలో విజయారెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. విజయారెడ్డి అంతిమయాత్రలో పాల్గొనేందుకు ఉద్యోగులంతా హైదరాబాద్‌కు రావాలని ఉద్యోగ సంఘాల నేతలు సూచించారు. విజయారెడ్డి మృతికి సంతాపంగా మూడు రోజుల పాటు విధులు బహిష్కరించి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.

నిందితుడు సురేష్‌పై హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు పోలీసులు. సురేష్ నోరు తెరిస్తే.. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. భూవివాదమే కారణమని చెబుతున్నా.. ఇంకా ఇందులో అసలు నిజం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అటు విజయారెడ్డి హత్యపై సీరియస్‌ అయిన ప్రభుత్వం.. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది.

Tags

Next Story