ఇసుక కొరతతో మరో కార్మికుడు ఆత్మహత్య

ఏపీలో భవన నిర్మాణ కార్మికులు ఉసురు తీసుకుంటున్నారు.. ఇసుక కొరతతో ఐదు నెలలుగా నిర్మాణ పనులు నిలిచిపోవడంతో పస్తులుండలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు.. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. స్థానిక డెయిరీ ఫామ్ సెంటర్‌లోని రాజీవ్ గృహకల్ప బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఉపాధి లేకపోవడంతో కుటుంబాన్ని పోషించలేక మనస్తాపం చెందిన కొయ్య వీరబాబు.. బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.
పెదపూడి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన వీరబాబు గ్రామంలో ఉపాధి లేకపోవడంతో నాలుగు నెలల క్రితం కాకినాడ వలస వచ్చాడు. కుటుంబంతో కలిసి స్థానిక డెయిరీ ఫామ్ సెంటర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. కాకినాడ వచ్చినప్పటి నుంచి ఉపాధి లేకపోవడంతో అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. అయితే, రోజురోజుకూ పని దొరుకుతుందన్న ఆశ సన్నగిల్లడం, అప్పుల వాళ్ల వేధింపులు పెరగడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో భార్యా బిడ్డలు లేని సమయంలో బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.. వీరబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కు ఆత్మహత్య చేసుకోవడంతో వీరబాబు కుటుంబం రోడ్డున పడింది.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. అతని కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.. వీరబాబు మృతి తీవ్రంగా కలచివేసిందన్నారు. కార్మికుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వెంటనే వీరబాబు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.. ఇప్పటికైనా ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసి సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈరోజు కాకినాడ వెళ్లనున్నారు.. వీరబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com