వీరబాబు కుటుంబానికి అండగా ఉంటాం : నారా లోకేశ్

వీరబాబు కుటుంబానికి అండగా ఉంటాం : నారా లోకేశ్
X

lokesh

10 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసిన ఘనత ప్రభుత్వానిదే అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌. గతంలో ఎన్నడూ ఇలాంటి దుస్థితి లేదన్నారు. ఇప్పటి వరకు 38 మంది చనిపోతే.. ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టైనా లేదన్నారు. కాకినాడలో రాజీవ్‌ గృహకల్ప అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న వీరబాబు కుటుంబాన్ని లోకేష్‌ పరామర్శించారు. వీరబాబు మృతదేహాన్ని జీజీహెచ్‌లో సందర్శించారు. అనంతరం వీరబాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కుటుంబ పరిస్థితిపై ఆరా తీశారు. ఐదు నెలలుగా అనేక ఇబ్బందులు పడ్డామని.. పనుల్లేక అప్పుల పాలయ్యామని వీరబాబు భార్య దుర్గ లోకేష్‌ ముందు గోడు వెళ్లబోసుకుంది.. కుటుంబాన్ని పోషించే స్తోమత లేకే బాధతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడంటూ కన్నీటి పర్యంతమైంది.. దీంతో చలించిపోయిన లోకేష్‌.. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

వీరబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో లోకేష్‌ మాట్లాడారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం గతంలో ఎన్నడూ లేదన్నారు.. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

కుటుంబ పోషణ కష్టమై వీరబాబు ఆత్మహత్య చేసుకోవడం దారుణమన్నారు లోకేశ్‌. గతంలో ప్రజలు నీటి కొరతను చూస్తే... వైసీపీ హయాంలో ఇసుక కొరతను చూస్తున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Tags

Next Story