విజయారెడ్డిని హత్య చేసి తాపీగా నడుచుకుంటూ బయటకు..

విజయారెడ్డిని హత్య చేసి తాపీగా నడుచుకుంటూ బయటకు..

suresh

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ హత్య తెలుగురాష్ట్రాల్లో కలకలం రేపింది. పట్టపగలు జరిగిన మహిళా అధికారి హత్యోదంతం యావత్‌ సమాజాన్ని కలచివేసింది. ఉత్తమ ఎమ్మార్వోగా ఉన్నతాధికారుల ప్రశంసలు పొందిన విజయారెడ్డిని కడసారి చూసేందుకు కొత్తపేటలోని ఆమె ఇంటివద్దకు పెద్ద ఎత్తున స్థానికులు, రెవెన్యూ ఉద్యోగులు తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, ఉద్యోగుల అశృనయనాల మధ్య... విజయారెడ్డి అంతిమయాత్ర ప్రారంభమైంది. అంతిమయాత్ర నాగోల్‌లోని అల్కాపురి చేరుకున్నాక రెవెన్యూ సిబ్బంది ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. దీంతో అక్కడ భారీ ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. పోలీసులు రెవెన్యూ ఉద్యోగులతో మాట్లాడి..అంతిమయాత్ర శాంతియుతంగా కొనసాగేలా చేశారు పోలీసులు....

కుటుంబ సభ్యులు, స్థానికులు, ఉద్యోగులతో సాగిన విజయారెడ్డి అంతిమయాత్ర నాగోలు శ్మశానవాటికకు చేరుకుంది. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో..విజయారెడ్డికి అంత్యక్రియలు నిర్వహించారు. గౌరవ సూచికంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. విజయారెడ్డి చితికి భర్త సుభాష్‌ రెడ్డి నిప్పంటించారు.

తహసీల్దార్‌ విజయారెడ్డి మృతిపట్ల తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు నిరసనలు తెలిపారు. చాలా చోట్ల కలెక్టరేట్‌, ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. విజయారెడ్డి మృతిపై మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించారు రెవెన్యూ ఉద్యోగులు.

మరోవైపు.. విజయారెడ్డిని రక్షించబోయి తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ గురనాథం ప్రాణాలు కోల్పోయాడు. మంటల్లో చిక్కుకున్న తహసీల్దార్‌ను రక్షించే ప్రయత్నంలో గురునాథంకు 80 శాతం గాయాలయ్యాయి. DRDO అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెల్దండ గ్రామానికి చెందిన గురునాథం మొదట్లో లారీ డ్రైవర్‌గా పనిచేశాడు. స్నేహితుల సహాయంతో కారు డ్రైవర్‌గా కుదురుకుని ఐదేళ్లుగా తహసీల్దార్‌ కార్యాలయంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురునాథంకు మూడేళ్ల క్రితం వివాహమైంది. భార్య సౌందర్యతోపాటు మూడేళ్ల కుమారుడు సిద్దార్థ్‌ ఉన్నారు. ప్రస్తుతం భార్య గర్భవతి కావడంతో పుట్టింటివద్ద ఉంది. గురునాథ్‌ మృతి వార్త... అతడి కుటుంబాన్ని కలచివేసింది.

మరోవైపు విజయారెడ్డి హత్య కేసులో రాచకొండ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. విజయారెడ్డిని హత్య చేసిన తర్వాత నిందితుడు సురేష్ MRO ఆఫీస్‌ నుంచి తాపీగా నడుచుకుంటూ బయటకు వెళ్లాడు. కాలిన గాయాలతో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లడం సీసీ టీవీ పుటేజీలో రికార్డయింది. పక్కనే ఉన్న బాయ్స్ హాస్టల్‌ నుంచి ఈ సీసీ పుజేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో 25 శాంపిల్స్ సేకరించారు. నిందితుడు రెండు లీటర్ల కిరోసిన్, పెట్రోల్‌తో కలిపి తీసుకువచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల ఆదుపులో ఉన్న సురేష్‌ 60 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సురేష్ తండ్రి కూర కిష్టయ్య తోపాటు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story