ఫలించిన అగ్రిగోల్డ్ బాధితుల ఎదురు చూపులు

అగ్రిగోల్డ్ బాధితుల ఎదురు చూపులు ఫలించాయి.. నగదు చెల్లింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ గుంటూరు వేదికగా శ్రీకారం చుట్టనున్నారు. గుంటూరు పోలీస్ పెరేడ్‌గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్టవ్య్రాప్తంగా 10 వేల లోపు డిపాజిట్‌లు చేసిన వారందరికీ ఈరోజు నుంచి చెల్లింపులు జరగనున్నాయి. బాధితులు అధికంగా ఉన్న విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి మొదలు 13 జిల్లాల్లో 10 వేలలోపు డిపాజిట్‌దారులందరికీ అధికారులు చెల్లింపులు జరపనున్నారు.
బాధితులకు కొంత ఉపశమనం కలిగించాలన్న ఉద్దేశంతో పదివేల రూపాయలలోపు వారికి చెల్లింపులు జరపాలని గత ప్రభుత్వ హయాంలోనే నిర్ణయం తీసుకున్నారు.. బాధితులంతా జిల్లా లీగల్ సెల్‌లకు వెళ్లి రశీదులు, బ్యాంకు పాస్‌బుక్‌లను అధికారులకు అందజేశారు.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ తొలి మంత్రివర్గ సమావేశంలోనే అగ్రిగోల్డ్ బాధితుల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది.. తొలి బడ్జెట్‌లోనే బాధితుల కోసం 1,150 కోట్లు కేటాయించింది. సంస్థ ఆస్తుల విక్రయ ప్రక్రియ కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ.. బాధితులకు న్యాయం చేసేందుకు ముందుగా చెల్లింపులు జరిపాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే 10వేల లోపు డిపాజిట్ చేసిన వారికి అక్టోబర్ 18న 263 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3.69 లక్షల మందికి తొలి విడతలో చెల్లింపులు జరపనుంది ప్రభుత్వం. జిల్లా లీగల్ సెల్‌ల ద్వారా ఈ డబ్బును బాధితులకు అందజేయనుంది.
ఈ ప్రక్రియ పూర్తయితే, మలి విడతలో 20 వేల రూపాయల లోపు డిపాజిట్ దారులకు చెల్లింపులు జరపనుంది.. 20వేల లోపు డిపాజిట్ చేసిన వారి జాబితాను కూడా ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది.. మొత్తం 4 లక్షల మంది ఉన్నట్లు నిర్ధారించింది. వీరికి కూడా త్వరలోనే చెల్లింపులు జరిపే అవకాశం కనిపిస్తోంది. కష్టపడి సంపాదించిన డబ్బును తిరిగి కళ్ల చూస్తామో లేదో అనుకున్న అగ్రిగోల్డ్ బాధితులు ఈరోజు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com