జగన్ ఇంటి కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ.15 కోట్లా? - చంద్రబాబు

చిత్తూరుజిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పుంగనూరు నేతలతో సమావేశమయ్యారు. ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోదంటూ కార్యకర్తలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని.. కొందరిపై రౌడీ షీట్ కూడా తెరిచారని తెలిపారు.
వైసీపీ తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను వేధించడం మానుకోవాలని హెచ్చరించారు. 150 రోజుల పాలనలో టీడీపీ నేతలపై 630 కేసులు పెట్టారని అన్నారు. తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేస్తామన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళతామని చంద్రబాబు స్పష్టంచేశారు.
చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు చంద్రబాబు. టీడీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెట్టినవారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అధికారులు, పోలీసులు కూడా ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరించొద్దని సూచించారు. చట్టవ్యతిరేక పనులు చేయకపోవడం వల్లే సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేశారని ఆరోపించారు చంద్రబాబు.
అంతకుముందు జగన్ తీరుపై ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. జగన్ నివాసం కోసం ప్రభుత్వ ఖజానా నుంచి 15 కోట్ల రూపాయలు తరలి వెళ్లడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని పేర్కొన్నారు. ఓవైపు రాష్ట్రం ఆర్థికభారంతో సతమతమవుతోందని, మరోవైపు భవన నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రం ఇంతగా రగిలిపోతుంటే జగన్ మాత్రం తన విలాసవంతమైన ఇంట్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com