అయ్యప్ప మాల వేసుకున్న పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలి : రాజాసింగ్

అయ్యప్ప మాల వేసుకొని దీక్ష చేపట్టే పోలీసులు సెలవుపై వెళ్లాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీస్తున్నాయి. విధులకు హాజరయ్యే వారు తప్పకుండా యూనిఫాం ధరించాల్సిందేనని ఆయన పోలీసులను ఆదేశించారు. యూనిఫాం, షూ లేకుండా పోలీసులు విధులు నిర్వహించడం కుదరదని స్పష్టం చేశారు. క్రమశిక్షణ కలిగిన పోలీస్ శాఖలో ప్రత్యేక అనుమతులు ఇవ్వడం కుదరదని ఆయన పోలీసులకు సూచించారు. గడ్డాలు, మీసాలు పెంచి పోలీసులు విధులు నిర్వహిస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని మహేష్ భగవత్ కుండ బద్దలు కొట్టారు. యూనిఫాం నుంచి మినహాయింపు కోరుతూ వచ్చే విజ్ఞప్తుల్ని సీపీ కార్యాలయానికి పంపవద్దని తన కింది స్థాయి అధికారులకు కమిషనర్ ఆఫీస్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయమే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. అయ్యప్ప మాల వేసుకొని డ్యూటీకి రావొద్దని మెమో జారీ చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. ఎవరి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారో సీపీ చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో అంతా కలిసి మెలిసి ఉంటున్నారన్న రాజాసింగ్.. పోలీసుల్లో మాత్రం ఈ విభేదాలు ఎందుకని రాజాసింగ్ ప్రశ్నించారు. అయ్యప్ప మాల వేసుకున్న పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com