నెల్లూరు జిల్లాలో కిడ్నాప్‌కి గురైన పాప ఆచూకీ దొరికింది

నెల్లూరు జిల్లాలో కిడ్నాప్‌కి గురైన పాప ఆచూకీ దొరికింది
X

papa

నెల్లూరు జిల్లాలో నిన్న శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో కిడ్నాప్‌కి గురైన 2 నెలల పాప ఆచూకీ దొరికింది. కావలిలో ఓ మహిళ పాపను తీసుకుని ట్రైన్ దికి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ బిడ్డతో సింగరాయకొండ వైపు వెళ్లినట్టు గుర్తించారు.

కడుపు చేతబట్టుకొని పిల్లాపాపలతో సుదూర ప్రాంతాలకు వెళుతున్న తల్లిదండ్రులకు మార్గమధ్యలోనే వేదన మిగిలింది. తల్లి స్పర్శ, ఆకలేస్తే ఏడవడం తప్ఫ. ఏమీ తెలియని రెండు నెలల పసికూన ఉన్న పళంగా వారి నుంచి దూరమైంది. ప్రయాణంలో కొంత దూరం తల్లిపొత్తిళ్లలో ఒదిగి సేదదీరినా.. ఆ తర్వాత ఉయ్యాలలో నిద్రించిన ఆ పసిపాప మాయమైంది. తల్లిదండ్రులకు మెలకువ వచ్చి చూడగా పసిపాప కానరాకపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఆందోళనతో రైలు బోగీలన్నీ వెతికినా ఫలితం లేకపోయింది. అప్పటివరకు తమతో మాటామంతీ కలిపిన ఇద్దరు మాయలేడీలే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని గుర్తించి రైల్వేపోలీసులను ఆశ్రయించారు. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటన పై పోలీసులు విచారణ వేగవంతం చేసారు. పాపను అపహరించిన ఆగంతకురాలిని గుర్తించారు..

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల గ్రామానికి చెందిన వేము గోపి, కృష్ణవేణి కూలీ పనులు చేసుకొని జీవిస్తున్నారు. స్థానికంగా పనులు లేకపోవడంతో జీవనోపాధి పొందేందుకు తమ ముగ్గురు ఆడపిల్లలతో బెంగళూరుకు వలస బయలుదేరారు. మంగళవారం రాత్రి తణుకు చేరుకొని శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో జనరల్‌ బోగీలో ఎక్కారు. అదే బోగిలో ఎక్కిన ఇద్దరు మహిళలు వీరిపక్కనే కూర్చొని కొంతదూరం వచ్చాక మాటలు కలిపారు. మీ ముగ్గురు ఆడపిల్లల్లో ఒకరిని అమ్మండంటూ వారిని అడగడంతో ఆ తల్లిదండ్రులు కృష్ణవేణి, గోపి అంగీకరించలేదు. ఇద్దరు పిల్లలు నిద్రపోవడంతో బోగీలోని సీట్ల మధ్యలో కింద పడుకోబెట్టారు. విజయవాడకు వచ్చాక రెండు నెలల పాపను కూడా వారి మధ్యే ఉంచారు. చీరతో ఉయ్యాల వేస్తే హాయిగా నిద్రపోతుందని ఆ ఇద్దరు మహిళలు సలహా ఇవ్వడంతో గోపి రెండు సీట్లకు చీరతో ఉయ్యాల కట్టి పాపను అందులో పడుకోబెట్టారు. విజయవాడ నుంచి కావలి మధ్యలో గోపి దంపతులు నిద్రలోకి జారుకున్నారు. కావలి రైల్వేస్టేషన్‌ దాటాక మెలకువ రాగా.. పసిపాపకు పాలిచ్చేందుకు ఉయ్యాలలో చూడగా లేకపోవడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వీరిపక్కనే ఉన్న ఇద్దరు మహిళలు సైతం లేకపోవడంతో బోగీ మొత్తం వెతికారు. ఎక్కడా కానరాకపోవడంతో వారే బాలికను ఎత్తుకెళ్లినట్లు నిర్ధరణకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు.

నెల్లూరు రైల్వేస్టేషన్‌లో రైలు ఆగగానే దిగి ఆ ఇద్దరు మహిళల కోసం వెతికారు. అయినా కానరాకపోవడంతో నెల్లూరు పోలీసులను ఆశ్రయించారు. రైలు కావలి దాటాక పసిపాప లేని విషయాన్ని గుర్తించారని, అక్కడ ఏమైనా దిగారేమో పరిశీలించాలని కావలి రైల్వేస్టేషన్‌కు వారిని పంపించారు. వారి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు స్థానిక సీసీ ఫుటేజీలను పరిశీలించారు. జాడ తెలియకపోవడంతో వీరిని నెల్లూరు, గూడూరు రైల్వేస్టేన్లకు తీసుకెళ్లి సీసీ ఫుటేజీలను చూపించారు. వారు తెలిపిన ఆనవాళ్లతో మహిళల కోసం అన్నీ రైల్వేస్టేషన్లలో అయిదు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు రైల్వే పోలీసులు.

పాప అదృశ్యంపై ఫిర్యాదు అందుకున్న రైల్వే పోలీసులు వేగంగా స్పందించారు. ప్రకాశం జిల్లా చీరాల నుంచి గూడూరు వరకు రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. కావలి పట్టణ రైల్వేస్టేషన్‌లో మంగళవారం రాత్రి 2.30 గంటల సమయంలో బిడ్డతో దిగిన ఓ మహిళ పవన్‌కుమార్‌ అనే వ్యక్తి ఆటో ఎక్కి కావలి ఆర్టీసీ బస్టాండులో దిగింది. సింగరాయకొండ వైపు వెళ్లేందుకు సమాచారం తెలుసుకొందని ఆటోడ్రైవర్లు తెలిపారు. ఆ తర్వాత ఆమె సింగరాయకొండ వైపు వెళ్లే బస్సులో ఎక్కడం సీసీ ఫుటేజీని బట్టి అధికారులు గుర్తించారు. సేకరించిన ఆధారాలతో పోలీసులు బిడ్డను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలో దింపారు.మధ్యాహ్నం లోగా బిడ్డను తల్లి ఒడికి చేరుస్తామని అంటున్నారు.

Tags

Next Story