ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న కీలక తీర్పు వెలువడబోతోంది..

ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న కీలక తీర్పు వెలువడబోతోంది..
X

supremcourt

ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్న కీలకమైన తీర్పు ఎట్టకేలకు వెలువడబోతోంది. ఎన్నో ఎళ్లుగా కొనసాగుతూ వస్తున్న అతి సున్నితమైన ఆయోధ్య వివాదంలో వాదనలు ముగిశాయి. వరుసగా 40 రోజులకుపైగా వాదనలు విన్న సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం మరికొన్ని రోజుల్లో తీర్పు వెలువరించనుంది. ఈనెల 17లోపు సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చే అవకాశముంది.

ఆయోధ్య తీర్పు ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతి కూలం అనే మాటను పక్కకుపెడితే సమస్య పరిష్కారమవుతోందనే భావన అందరిలో ఏర్పడింది. వివాదానికి ముగింపుపలికే అవకాశం ఏర్పడడంతో శాంతి సామరస్యాలకు విఘాతం కలగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఘర్షణలు జరగకుండా, అల్లర్లు చేలరేగకుండా జాగ్రత్త వహిస్తోంది. ఈ క్రమంలో ఉత్తర ప్ర దేశ్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్య, ఫైజాబాద్‌, గోరఖ్‌పూర్ సహా 12 జిల్లాల్లో అదనపు బలగాలను మోహరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా CRPF, RSF, ITBP, BSF దళాలను కూడా రంగంలోకి దింపారు. అలాగే, 4 వేల పారామిలటరీ బలగాలను తరలించారు. యూపీతో పాటు మిగతా రాష్ట్రాలను కూడా కేంద్రం అలర్ట్ చేసింది. భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకో వాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించింది. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని కోరింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఫుల్ అలర్ట్‌గా ఉంది. పోలీసులకు సెలవులు రద్దు చేసింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా పోలీసులు సెలవులు రద్దు చేసింది. అత్యంత కీలకమైన తీర్పు కావడంతో దాదాపు అన్ని రాష్ట్రాలు ఫుల్ అలర్ట్‌గా వ్య వహరిస్తున్నాయి.

ఇక, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రులకు హెచ్చరికలు జారీ చేశారు. అయోధ్య కేసులోపై సుప్రీంకోర్టు తీర్పుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు. అనవసరమైన ప్రకటనలు చేయవద్దని, విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని హెచ్చరించరారు. ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. దేశంలో మతసామరస్యాన్ని కాపాడడం మనందరి విధి అని గుర్తు చేశారు. పుకార్లకు అవకాశమిచ్చేలా మాట్లాడడం, సోదరభావాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం లాంటి చర్యలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. సుప్రీంకోర్టు తీర్పును అందరూ స్వాగతించాలని కోరారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా, పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టవద్దని, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సంయమనం పాటించాలని సూచించారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కూడా తన శ్రేణులకు మార్గదర్శకాలు జారీ చేసింది. సుప్రీం తీర్పుపై వివాదాస్పద ప్రకటనలు చేయవద్దని కార్యకర్తలు ఆదేశించింది. సంఘ్ ముఖ్యులు, ప్రచారక్‌లు తమ తమ ప్రాంతాల్లోనే ఉండాలని, కార్యకర్తలు అదుపు తప్పకుండా చూసుకోవాలని నిర్దేశించింది. విశ్వహిందూపరిషత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రామాలయ నిర్మాణం కోసం చేపట్టిన పనులను నిలిపేసింది. రామాలయ నిర్మాణ పనులను వీహెచ్‌పీ నిలిపివేయడం 1990 తర్వాత ఇదే మొదటిసారి. రాళ్లు చెక్కడాన్ని ఆపేసిన వీహెచ్‌పీ, శిల్పులు-ఇతర సిబ్బందిని ఇంటికి పంపించివేసింది. దీంతోపాటు దేశవ్యాప్తంగా తలపెట్టిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసింది.

ముస్లిం వర్గాలు కూడా సంయమనంతో వ్యవహరిస్తున్నాయి. కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ నివాసంలో జమాతే ఉలేమా హింద్, షియా వర్గాలు సమావేశమయ్యాయి. జమాతే ఉలేమా హింద్ నేత మౌలానా అర్షద్ మదానీ, షియా మతగురువు కాల్బే జావేద్, కేంద్రమాజీ మంత్రి షానవా జ్ హుస్సేన్, ఆర్‌ఎస్ఎస్ నేతలు కృష్ణ గోపాల్, రామ్‌లాల్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. తీర్పు ఎలా ఉన్నా సంయమనం పాటించాలని నిర్ణయించారు. తీర్పు ఎలా ఉన్నా తమకు సమ్మతమేనని మదానీ చెప్పారు. ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ కూడా అయోధ్యపై సుప్రీంతీర్పును స్వాగతించాలని కోరారు. దేశ ప్రజలకు సర్వోన్నత న్యాయస్థానంపై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ప్రతి ఒక్కరు సంయమనం పాటిస్తూ సోదరభావాన్ని ప్రతిబింబించే భారతీయ విలువలను ప్రపంచానికి చాటి చెప్పాలని విజ్ఞ ప్తి చేశారు.

మరోవైపు సోషల్ మీడియాలోని ట్విట్టర్ ప్లాట్‌ఫాంలో దేవుళ్ల పేర్లతో ఇటీవలి కాలంలో ట్విట్టర్ అకౌంట్లు విరివిగా కనిపిస్తున్నాయి. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పునివ్వనున్న నేపధ్యంలో ఇటువంటి అకౌంట్లు విరివిగా కనిపిస్తున్నాయి. దీంతో సైబర్ టీం ఇటువంటి ట్విట్టర్ అకౌంట్లపై దృష్టి సారించింది.

Tags

Next Story