గడ్కరీ ఎంట్రీతో శివసేన-బీజేపీ పొత్తు కుదిరేనా?

గడ్కరీ ఎంట్రీతో శివసేన-బీజేపీ పొత్తు కుదిరేనా?
X

MAHA

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత వీడలేదు. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిపక్షంలో ఉంటామని ప్రకటించాయి. సేన-బీజేపీ మధ్య చర్చలు కొలిక్కిరావడం లేదు. సీఎం పీఠంపై శివసేన వెనక్కు తగ్గడం లేదు. బీజేపీ అతిపెద్ద పార్టీగా ముఖ్యమంత్రి పదవి తమకే దక్కాలని అంటోంది. దీంతో పీఠముడి వీడడం లేదు. మరోసారి ఇరుపార్టీల మధ్య శుక్రవారం చర్చలు జరగనున్నాయి. తమకు మైనార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని.. మిత్రపక్షంతో కలిసి అధికార పగ్గాలు చేపడతామని బీజేపీ అంటోంది. ఆలస్యం అయినా.. శివసేనను ఒప్పించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్నారు.

మహారాష్ట్రలో పరిస్థితులు చక్కదిద్దటానికి ఆర్ఎస్ఎస్ సూచనలతో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రంగంలో దిగారు. అటు శివసేన కూడా గడ్కరీతో చర్చలు జరపడానికి అంగీకరించింది. ఇప్పటికే ఆయన ముంబయి చేరుకున్నారు. గతంలో అమిత్ షా మధ్యవర్తిత్వం అవసరం లేదని ప్రకటించిన ఉద్దావ్ థాక్రే.. గడ్కరీతో చర్చలకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వారి మధ్య సంప్రదింపులు జరగనున్నాయి. తన పార్టీ ఎమ్మెల్యేలతో ఉద్దావ్ థాక్రే మంతనాలు జరిపారు. మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకు ఆయన గడ్కరీ ముందు పలు డిమాండ్లు పెట్టే అవకాశం ఉంది. అయితే సీఎం పదవి విషయంలో మొండిగా ఉన్న శివసేన గడ్కరీ వద్ద అదే డిమాండ్ పెడుతుందా.. లేక సీఎం షరతు పక్కనపెట్టి.. ఇతర డిమాండ్లు నెరవేర్చుకుంటుందా అన్నది ఆసక్తిగా మారింది.

కాంగ్రెస్, ఎన్సీపీలు తమ పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలిస్తున్నాయి. అటు మహారాష్ట్ర ప్రభుత్వం గడువు ముగిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. శుక్రవారం కూడా ప్రభుత్వంపై స్పష్టత రాకపోతే.. గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Next Story