విజయారెడ్డి హత్య : ప్రజల నుంచి ఊహించని ఘటనలు

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసు ప్రకంపనలు కొనసాగుతున్నాయి. విజయారెడ్డి సజీవదహనంపై రెవెన్యు అధికారులు ఆందోళనలో ఉండగానే ప్రజల నుంచి ఊహించని ఘటనలు ఎదురవుతున్నాయి. భువనగిరి యాదాద్రి జిల్లా గుండాల మండలంలో నిరసనలో ఉన్న వీఆర్వోను ఓ మహిళ నిలదీసింది. రెండు వేలు లంచం తీసుకొని ఇంకా పని ఎందుకు చేయలేదంటూ బహిరంగంగానే నిలదీయటంతో వీఆర్వోలు నిరసన వదలేసి లేచి వెళ్లిపోయారు.
పట్టదార్ పాస్ పుస్తకాలు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ అశోక్ అనే వ్యక్తి ఎమ్మార్వో ఆఫీసులో హల్ చల్ చేశాడు. ఎమ్మార్వో ఛాంబర్ కు పెట్రోల్ బాటిల్ తీసుకెళ్లి ఆందోళన వ్యక్తం చేశాడు.మహాబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తహసీల్దార్ ఆఫీస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు అశోక్ ను అడ్డుకున్నారు. పోలీసులు నచ్చజెప్పటంతో అశోక్ ఆందోళన విరమించాడు.
ములుగు జిల్లాలో ఓ మహిళ ఏకంగా రోకలిబండతో హల్ చల్ చేసింది. పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వకుండా ఐదేళ్లుగా తనను ఆఫీసు చుట్టు తిప్పించుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లికి చెందిన రాచకొండ వీరయ్య సోషల్ మీడియాలో అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చిట్యాల ఎమ్మార్వో విశాలక్షిని దూషిస్తూ.. అబ్దుల్లాపూర్ మెట్ ఘటనే పునరావృతం కావాలన్నాడు.
భూమి పత్రాల కోసం అధికారుల చుట్టు తిరిగి వేసారిపోయిన వారు ఇక తిరుగుబాటు స్వరంతో ఆందోళనకు దిగితే...ఆ ధైర్యం చేయలేని రైతు మాత్రం ఎప్పటిలాగే అధికారులతో పోరాడలేక తన ఊపిరి తీసుకుంటున్నాడు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కొనగుంటలాకులో కొడాలి స్వామిదాసు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తన పొలానికి సంబంధించి పేరు మార్చుకునేందుకు ఆఫీసు చుట్టు తిరిగినా పని కాకపోవటంతో చివరికి సూసైడ్ చేసుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com