ఈ నెల 11లోపు చర్చలకు పిలవాలి : అశ్వత్థామరెడ్డి

ఈ నెల 11లోపు చర్చలకు పిలవాలి : అశ్వత్థామరెడ్డి

tsrtc

సమ్మెను మరింత ఉద్దృతం చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ జేఏసీ. డిమాండ్లు పరిష్కారమయ్యే వరకూ సమ్మె యథాతథంగా కొనసాగుతుందన్నారు అశ్వత్థామరెడ్డి. ఈ నెల 9న ట్యాంక్ బండ్‌పై నిర్వహించే మిలియన్ మార్చ్‌కు భారీ సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం ఈ నెల 11లోపు చర్చలకు పిలవాలన్న అశ్వత్థామరెడ్డి....ఈ నెల 9న మిలియన్‌ మార్చకు సిద్ధమైనట్లు తెలిపారు.

అంతకుముందు...ఆర్టీసీపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు సమర్పించిన అఫిడవిట్లపై సీరియస్‌ అయింది. ప్రభుత్వం చెబుతున్న అంకెలు... ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ... చెబుతున్న అంకెలు వేర్వేరుగా ఉన్నాయంది. తాము ఏ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని ప్రశ్నించింది. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి లెక్కలు, పదాలు వాడారని పేర్కొంది. మంత్రికి ఆర్టీసీ ఇంఛార్జ్‌ ఎండీ సునీల్ శర్మ తప్పుడు లెక్కలు ఇచ్చారని ఇది ప్రభుత్వాన్ని చీట్ చేసినట్లేనని పేర్కొంది. కేబినెట్‌కి సైతం అధికారులు ఆ తప్పుడు వివరాలే ఇచ్చారని...వాటి ఆదారంగానే స్టేట్‌మెంట్ ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేసింది..

తాను జడ్జిగా పనిచేసిన 15 ఏళ్లలో ఇంతగా అబద్ధాలు చెప్పే అధికారులను ఎక్కడా చూడలేదని సునీల్ శర్మఫై హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు..తాను మూడు రాష్ట్రాల్లో పని చేశానని.. హైకోర్టుకు ఇలా తప్పుడు సమాచారం ఎవరూ చెప్పలేదన్నారు. ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీని మంత్రి ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు..జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఆర్థిక శాఖ.. ఒక్కొక్కరు ఒక్కో పాట పడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.

కేంద్రం తరపున హైకోర్టులో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు వాదనలు వినిపించారు. APS RTC విభజన పూర్తి కాలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. TS RTCకి చట్టబద్ధత లేదన్నారు. APS RTC లోనే కేంద్రానికి 33 శాతం వాటా ఉందని తెలిపారు. సంస్థ రీ ఆర్గనైజేషన్‌కు కూడా తమ అనుమతి కోరలేదని స్పష్టం చేశారు. కొత్త ఆర్టీసీ ఏర్పాటు చేశామని ఎలా చెబుతారని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్రం ఆమోదం లేకుండా.. రెండు కొత్త సంస్థలు ఎలా ఏర్పాటు చేస్తారని నిలదీసింది..

అధికారుల తీరుపై హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? తదుపరి విచారణలో న్యాయస్థానం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story