ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్‌బండ్‌ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం

ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్‌బండ్‌ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం

rtc

ఆర్టీసీ సమ్మె, హైకోర్టు వ్యాఖ్యలు, కార్మిక సంఘాల చలో ట్యాంక్‌బండ్‌ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్‌ మరోమారు ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా గురు, శుక్రవారాల్లో హైకోర్టులో జరిగిన విచారణ వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. 5100 ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించడంతో ఆ అంశంపైనే సమీక్షలో ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రైవేటు పర్మిట్లకు ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులేంటని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎన్‌ ప్రసాద్‌ను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈనెల 11న మరోసారి విచారణ జరగనున్న నేపథ్యంలో ఆర్టీసీ, ప్రభుత్వం తరపున గట్టిగా వాదనలు వినిపించాలని అధికారులకు సీఎం సూచించారు.

మరోవైపు ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలికేందుకు హేతుబద్ధమైన చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ను డి.శ్రీనివాస్‌ కోరారు. ఆర్టీసీ సమ్మెపై ఆయన బహిరంగ లేఖ రాశారు. సమ్మె వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరిని ఆక్షేపించారు. పంతాలు, పట్టింపులను వీడి సమ్మెను పరిష్కరించాల్సిన ఆవశ్యకత గురించి ఆయన వివరించారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత ప్రకటిస్తూ వారిలో విశ్వసనీయత పెంచాలన్నారు. చర్చలు జరిపి కార్మికుల న్యాయమైన కోర్కెలను అంగీకరించి సమ్మె వివాదానికి ముగింపు పలకాలని లేఖలో డీఎస్‌ విజ్ఞప్తి చేశారు. కార్మికులు కొనసాగిస్తున్న పోరాటం తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తోందన్నారు డీఎస్‌. ఇప్పటికైనా సమ్మె పరిణామాలపై అన్ని రకాలుగా ఆలోచనలు చేసి కుటుంబ పెద్దగా సత్వరమే సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని సీఎం కేసీఆర్‌ను కోరారు డి.శ్రీనివాస్‌.

అటు ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ నిధికి చెల్లించాల్సిన బకాయిలు రూ.760 కోట్లు తక్షణం చెల్లించాలని ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మకు పీఎఫ్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 15లోపు కార్మికులకు బకాయిలు చెల్లించకుంటే భారీ జరిమానా తప్పదని హెచ్చరించారు. ఓవైపు ఆర్టీసీ సమ్మె, మరోవైపు హైకోర్టు చీవాట్లతో తల పట్టుకుంటున్న ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీకి ఈ ఎపిసోడ్‌ పుండుపై కారం చల్లినట్లుగా మారింది. అటు రవాణా శాఖ అధికారులు కూడా ఆర్టీసీ నుంచి బకాయిలు చెల్లించాలని సూచించడంతో ఎవరి నుంచి ఎప్పుడు ఎలాంటి సమాచారం వినాల్సి వస్తుందోనని అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరోవైపు ఈనెల 11న హైకోర్టుకు సమర్పించాల్సిన నివేదికపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story