ఆయోధ్యలో మాజీ ప్రధాని పీవీ ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఇంకా ఉంది..

ఎన్నో ఏళ్ల వివాదానికి పరిష్కారం దొరికింది. సందిగ్థతకు, మెలికలకు తావులేకుండా వివాదస్పద భూమిని రామజన్మ భూమిగా నిర్ధారిస్తూ .. అక్కడ రామ మందిర నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సూచించింది.. అదే సమయంలో ఆయోధ్యలో ఐదెకరాల స్థలం కేటాయించి మసీదు నిర్మాణం చేపట్టాల స్పష్టమైన తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సుప్రీం తీర్పును యావత్ దేశం సహృదయంతో స్వాగతించిందని ప్రధాని మోదీ అన్నారు. దేశ ప్రజలు అవలంభించిన భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ అని పేర్కొన్నారు. బెర్లిన్ గోడ బద్ధలైన రోజే..కర్తాపూర్ కారిడార్ ప్రారంభమైన రోజునే తీర్పు వెలువటం ఐక్యత సందేశాన్ని ఇచ్చినట్లైందని అభిప్రాయపడ్డారు.
రామజన్మభూమి కోసం రథయాత్ర చేసిన బీజేపీ సీనియర్ నేత ఎల్వే అద్వానీ ఆయోధ్య తీర్పును స్వాగతించారు. ఇన్నాళ్లకు తన కల నెరవేరిందన్నారు. ఇక దేశ ఐక్యతను, సమగ్రతను బలపర్చేందుకు అన్ని వర్గాల ప్రజలు ఒక్కటిగా పని చేయాలని పిలుపునిచ్చారు.
సుప్రీం తీర్పును దాదాపుగా ప్రతీ వర్గం అంగీకరించింది. అన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలు స్వాగతించాయి. ఇక ముందు జరిగబోయే ప్రక్రియ కూడా సుహృద్భావ వాతావరణంలో కొనసాగాలని ఆకాంక్షించారు. అయితే..ముస్లిం వర్గాల్లో తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. రాజస్థాన్ లోని అజ్మేర్ దర్గా సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించింది. ప్రజలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. సున్నీ వక్ఫ్ బోర్డు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసినా..అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది. రివ్యూ పిటీషన్ వేయాలనే నిర్ణయంపై వెనక్కి తగ్గింది.
ముస్లిం పర్సనల్ లా బోర్డు తీర్పుపై అసంతృప్తిగా ఉంది. రివ్యూ పిటీషన్ వేయాలా..వద్దా అనేది అంతర్గత చర్చ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ తీర్పుపై స్పందిస్తూ అందరికీ ఆమోదయోగ్యం లేదని అభిప్రాయపడ్డారు. అయితే..ఐదెకరాల స్థలమా? రివ్యూకి వెళ్లటమా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయిస్తుందని అన్నారు.
పార్టీల స్పందన ఎలా ఉన్నా..ప్రజల్లో మాత్రం ఐక్యతా భావం కనిపించింది. తీర్పు తర్వాత దేశవ్యాప్తంగా ఏ చిన్న సంఘటన చోటు చేసుకోలేదు. ప్రధాని నుంచి మత పెద్దల వరకు అంతా ముందస్తుగా పిలుపనివ్వటంతో ర్యాలీలు, నిరసనలకు రెండు వర్గాలు దూరంగా ఉండి సంయమనం పాటించాయి. ఇంతటితో వివాదం సమసిపోయిందనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తం అయింది. అయోధ్యలోనూ ప్రశాంత వాతావరణం కనిపించింది. అయితే.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భద్రతా బలగాలను కొనసాగిస్తున్నారు. ప్రతీ వ్యక్తిని గుర్తింపు కార్డు తనిఖీ చేశాకే నగరంలోకి అనుమతిస్తున్నారు.
అటు సోషల్ మీడియాలోనూ హడావుడి కనిపించలేదు. పోలీసుల ముందస్తు హెచ్చరికలతో అడ్మిన్లు ముందస్తుగానే జాగ్రత్తపడ్డారు. ఇక తీర్పు నేపథ్యంలో ఉగ్రవాదులు అలజడి సృష్టించే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉండటంతో కీలక నగరాలతో పాటు ఆథ్యాత్మిక క్షేత్రాల దగ్గర తనిఖీలు కొనసాగిస్తున్నారు. మరోవైపు 2.77 ఎకరాలను రామ జన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని నిర్ణయం కావటంతో ఇక రామ మందిర నిర్మాణంపై చర్చ ప్రారంభమైంది. రామమందిరం డిజైన్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగ ఉండాలని ద్వారక పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి అన్నారు. అయితే..ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీం ఆదేశంపై స్పందిస్తూ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఇప్పటికే ఉందని వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com