ఒడిషాపై విరుచుకుపడిన బుల్ బుల్.. గాలివాన బీభత్సం

ఒడిషాపై విరుచుకుపడిన బుల్ బుల్.. గాలివాన బీభత్సం
X

bulbul

బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుఫాన్‌ పశ్చిబెంగాల్‌, ఒడిషాపై విరుచుకుపడింది. రాత్రి డైమండ్‌ హార్బర్‌ ప్రాంతంలో సాగర్ ఐలాండ్ వద్ద తీరం దాటిన తుఫాన్.. ప్రచండ గాలులు, భారీ వర్షంతో విధ్వంసం సృష్టించింది. గాలివాన బీభత్సంతో ఒడిషాలోని పలు ప్రాంతాల్లో చెట్లు వేళ్లతో సహా కుప్పకూలాయి. ఇంటిపైకప్పులు లేచిపోయాయి. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

బుల్‌ బుల్‌ తుఫాన్‌ ప్రభావంతో ఒడిశాలోని బాలాసోర్, భద్రక్, కేంద్రపరా, జగత్ సింగ్ పూర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలిదుమారంతో ఈ ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లింది. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. ఒడిషా తీరంలో అలలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.

పశ్చిమ బెంగాల్‌ను బుల్‌ బుల్‌ తుఫాన్‌ వణికిస్తోంది. సౌత్ 24 పరగణాస్ జిల్లాలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. తుఫాన్ ధాటికి చాలా ప్రాంతాల్లో చెట్లు, స్తంభాలు నేలకొరిగాయి. భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. సీఎం మమతా బెనర్జీ కంట్రోల్‌ రూంకు చేరుకుని ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తన్నారు. తుఫాన్ నేపథ్యంలో స్కూళ్లకు మరో రెండు రోజులు సెలవులు పొడించింది బెంగాల్‌ ప్రభుత్వం. అటు రంగంలోకి దిగిన ఎన్టీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రహదారులపై విరిగిపడ్డ చెట్లను తొలగిస్తూ రాకపోకలను క్లియర్‌ చేస్తున్నారు. లోతట్టు, తీర ప్రాంతాల్లోని దాదాపు లక్షా 20 వేల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

సాగర్ వద్ద తీరం దాటిన తర్వాత బుల్ బుల్ తుఫాన్ క్రమంగా బలహీనపడుతోంది. అక్కడి నుంచి ఈశాన్య దిశగా పయనిస్తూ సుందర్ బన్ డెల్టా మీదుగా బంగ్లాదేశ్‌లోని ఖేపుపారా వైపు కదులుతోంది. దీని ప్రభావంతో బంగ్లాదేశ్‌ తీరం ప్రాంతాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

Tags

Next Story