సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న దేవేంద్ర ఫడ్నవిస్‌

సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న దేవేంద్ర ఫడ్నవిస్‌
X

padnaves

గత రెండు వారాలుగా ఉత్కంఠ రేపుతున్న మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 105 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి గవర్నర్‌ నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం లభించింది. బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్‌కు గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ ఆహ్వానం పంపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరిన గవర్నర్... ఈనెల 11న బలం నిరూపించుకోవాలని ఆదేశించారు. గవర్నర్ ఆహ్వానం మేరకు సోమవారం ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు దేవేంద్ర ఫడ్నవిస్‌. అదే రోజు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. బీజేపీ-105, శివసేన-56, ఎన్సీపీ-54, కాంగ్రెస్-44 స్థానాలు సాధించాయి. ఇతరులు 29 సీట్లల్లో విజయం సాధించారు. అయితే ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఏర్పడింది. కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ, శివసేన మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ముఖ్యమంత్రి పీఠం, కేబినెట్‌ పంపకాలపై విభేదాలు వచ్చాయి. 50-50 ఫార్మూలా పాటించాలని, సీఎం సీటును చెరి రెండున్నరేళ్లు పంచాలని శివసేన డిమాండ్ చేసింది. మంత్రివర్గంలో సగం బెర్త్‌లు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ డిమాండ్లకు బీజేపీ నాయకత్వం ఒప్పుకోలేదు. డిప్యూటీ సీఎం, ఎక్కువ పోర్ట్‌ఫోలియోలు ఇస్తామని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై శివసేన తీవ్రంగా మండిపడింది. తమ పార్టీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడని తేల్చి చెప్పింది. ఇటు శివసేన-అటు బీజేపీ ఇద్దరు పట్టువిడవకపోవడంతో రెండు వారాలుగా మహారాష్ట్రలో ప్రతిష్టంభన కొనసాగుతూ వస్తోంది.

మహారాష్ట్ర శాసనసభలో మొత్తం 288 స్థానాలు ఉండగా, బల నిరూపణకు అవసర మైన మ్యాజిక్ ఫిగర్ 145. ఈ లెక్కన విశ్వాసపరీక్షలో ఫడ్నవిస్ గెలిచే అవకాశం లేదు. ఐతే, శివసేన తమకు తప్పకుండా మద్దతిస్తుందని కమలనాథులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ, శివసేన మద్దతివ్వకపోతే ఎన్సీపీ అండగా నిలిచే అవకాశాలు ఉంటాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బల పరీక్ష సమయంలో 54 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 234కు పడిపోయి మ్యాజిక్ ఫిగర్ 118కి తగ్గుతుంది. అప్పుడు, స్వతంత్రులు, ఇతర ఎమ్మెల్యేల మద్దతుతో బల నిరూపణలో గట్టెక్కవచ్చని కమలదళం అంచనా వేస్తోంది. మెజారిటీ సంఖ్య బలం లేకుండానే బీజేపీని గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంపై శివసేన మండిపడుతోంది.

మరోవైపు గవర్నర్‌ వ్యవహరించిన తీరుపై మహారాష్ట్రలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి.. సంఖ్యాబలం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీని ఆహ్వానించడంపై ఓ వైపు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారా అని విపక్షాలు గవర్నర్‌ను ప్రశ్నించే పరిస్థితి నెలకొంది. ఇది పరోక్షంగా ఎమ్మెల్యేల కొనుగోళ్లకు తావిచ్చినట్టేననే వాదనను తెరమీదకు తెస్తున్నాయి.. ఈ నేపథ్యంలో గవర్నర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది.. ప్రమాణస్వీకారం అనంతరం ఫడ్నవిస్‌ కు ఏమాత్రం సమయం ఇవ్వకుండా అదే రోజు బలనిరూపణకు గవర్నర్‌ ఆదేశించారు. ఈ నిర్ణయాలకు గత పరిణామాలే కారణమని తెలుస్తోంది. ప్రమాణస్వీకారం అనంతరం బలనిరూపణకు ఎక్కువ సమయం కేటాయిస్తే కర్నాటకలో యడియూరప్పకు అవకాశం ఇచ్చిన సమయంలో జరిగిన పరిణామాలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందనే ఆలోచనగా తెలుస్తోంది. ఇక్కడా ఆ పరిస్థితి రాకూడదనే గవర్నర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫడ్నవిస్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ సాధిస్తానన్న నమ్మకం ఉంటేనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. లేని పక్షంలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అటు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమికి అవకాశాలకూ ఇదే గడువుగా భావించాల్సిన పరిస్థితి నెలకొంది.

Tags

Next Story