పెళ్లి పందిట్లో పెను విషాదం.. నిండు ప్రాణాలను తీసిన..

పెళ్లి పందిట్లో పెను విషాదం.. నిండు ప్రాణాలను తీసిన..

golnakal

హైదరాబాద్‌లోని ఓ పెళ్లి వేడుక విషాదంగా మారింది. అంబర్‌పేటలోని పెరల్ గార్డెన్ ఫంక్షన్‌ హాల్ గోడకూలి ఐదుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గోల్నాక పెరల్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఉదయం వివాహం జరుగుతుండగా వేదిక వెనుక ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగానే ఉంది.

గొడ కూలడంతో పక్కనే ఉన్న రెండు ఆటోలు, బైక్‌లు ధ్వంసమయ్యాయి. శిథిలావస్థకు వచ్చిన ఫంక్షన్ హాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని ఇదివరకే యాజమాన్యానికి నోటీసులు అందినట్లు తెలుస్తోంది. అయినా వారు పట్టించుకోలేదు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఫంక్షన్‌ హాల్‌ నపడుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో హోటల్‌ యజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. దీంతో ఫంక్షన్‌ హాల్‌ యజమాని, సిబ్బంది అంతా పరారీలో ఉన్నారు.

ఫంక్షన్‌ హాల్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు ఆరోపించారు. పాత కట్టడాలపైనే కొత్త గోడలు కట్టారని.. అక్రమంగా నిర్మాణం జరుగుతున్నా జీహెచ్‌ఎంసీ సిబ్బంది పట్టించుకోలేదని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలల తర్వాత ఆదివారమే ఫంక్షన్‌ హాల్‌ను తిరిగి ఓపెనింగ్‌ చేశారు. పిల్లర్‌ సహాయం లేకుండానే భారీగా గోడను నిర్మించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

గోల్నాక పెరల్ గార్డెన్ గోడ కూలి నలుగురు మృతి చెందిన ఘటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారికి మెరుగైన వైద్యం అందించి.. ఘటనపై విచారణ జరపాలని సూచించారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు ఒక్కొక్కరికీ రూ. రెండు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మరోవైపు ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లిన డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దిన్ క్షతగాత్రులను పరామర్శించారు.

కాసుల కక్కుర్తి కోసం ఫంక్షన్‌ హాల్‌ యజమాన్యం నిర్లక్ష్యం ఐదు ప్రాణాలను బలితీసుకుంది. సందడిగా ఉండాల్సిన వివాహ వేదికలో విషాద చాయలు అలముకున్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా.. కొందరిలో మార్పు కనిపించడం లేదు. నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేస్తున్నా.. చర్యలు తీసుకోవాల్సిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరించడంతో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story