కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు థ్యాంక్స్ చెప్పిన మోదీ

కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు థ్యాంక్స్ చెప్పిన మోదీ
X

kartharpoor

పంజాబ్ సరిహద్దు నుంచి చూస్తే కనుచూపు మేరలోనే దర్బార్ సాహిబ్ గురుద్వారా. సిక్కుల ప్రార్థనా మందిరం చేరువలోనే ఉన్నా.. గురుద్వారాను సందర్శించలేని పరిస్థితి ఇక తొలిగిపోయింది. బద్ధ శత్రువుల సరిహద్దు ప్రాంతంలోని గురుద్వారాలో మళ్లీ ప్రార్ధనలు మొదలయ్యాయి. దీంతో సిక్కుల సుదీర్ఘ కల నేరవేరింది.

రెండు దేశాల మధ్య పచ్ఛన్నయుద్ధం, దౌత్య యుధ్ధం పతాక స్థాయిలో ఉన్న సమయంలో ప్రారంభమైన కర్తార్ పూర్ కారిడార్ కొంత ఉద్రిక్తలను తగ్గించేందుకు దోహదపడనుంది. గురుద్వారా సందర్శనకు సిక్కులను అనుమతించిన పాకిస్తాన్ కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. కర్తాపూర్ కారిడార్..రెండు దేశాల శాంతి కారిడార్ అవుతుందని అన్నారు.

భారత్ వైపు ఉన్న కర్తార్పూర్ కారిడార్ చేరుకున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్..ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రెండు దేశాల బంధానికి కార్తార్ పూర్ కారిడార్ ప్రారంభం శుభసూచకమని అన్నారు.

తొలి రోజున 562 మంది సిక్కులు దర్బార్ సాహిబ్ గురుద్వారాను సందర్శించారు. ఎన్నో ఏళ్ల తర్వాత తెరుచుకున్న దర్బార్ సాహిబ్ గురుద్వారాను సందర్శించటం సంతోషంగా ఉందన్నారు. తొలి రోజు గురుద్వారాను సందర్శించిన వారిలో పంజాబ్ మాజీ మంత్రి సిద్ధు, సినీ హీరో సన్నిడియోల్ కూడా ఉన్నారు.

పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ వైపు కారిడార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సిద్ధు ఇరు దేశాల ప్రధాన మంత్రులపై ప్రశంసలు కురిపించారు. కేవలం పది నెలల్లో ప్రారంభం కావటంలో మోదీ చొరవ కాదనలేనిదని అన్నారు. రాజకీయ వైరుధ్యాలు ఉన్నా మున్నాభాయ్ ఎంబీబీఎస్ తరహాలో మోదీకి హగ్ ఇస్తున్నా అంటూ తనదైన స్టైల్ లో ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.

అయితే.. తొలిరోజు ఫ్రీ ఎంట్రీ అని చెప్పిన పాకిస్తాన్ ఒక్కొకరి దగ్గర్నుంచి 20 డాలర్లు వసూలు చేసింది. ప్రతీ రోజు దాదాపు 5000 మంది భక్తులు దర్బార్ సాహిబ్ గురుద్వారాను సందర్శించే అవకాశాలు ఉన్నాయని పాక్ అంచనా వేస్తోంది.

Tags

Next Story