నవంబర్ 9.. తేదీకి అనేక ప్రత్యేకతలు

నవంబర్ 9.. ! ఈ తేదీకి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు అంతిమ తీర్పు ఇచ్చింది. ఈ చారిత్రక తీర్పుతో 130 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు ఇదే రోజున పరిష్కారం దొరికింది. ఎన్నో వివాదాలు, మరెన్నో కేసులు, ఇంకెన్నో వాదనలు, అడ్డంకులు, మధ్యవ ర్తిత్వాలు దాటుకొని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు ప్రకటించింది. అయోధ్యలోని వివాదాస్పద భూభాగం శ్రీరామునికే చెందుతుందని స్పష్టం చేసింది. వివాదాస్పద స్థ లంలోనే రామాలయాన్ని నిర్మించాలని, ఇందుకోసం అయోధ్య ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇక ... మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోనే ప్రత్యేకంగా ఐదు ఎకరాలు కేటాయించాలని ఆదేశించింది. సుప్రీం తీర్పుతో అయోధ్య వివాదానికి తెరపడింది.
ఇక ఇదే నవంబర్ 9న సిక్కుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. పవిత్ర గురుద్వారా సందర్శన ప్రారంభమైంది. అత్యంత కీలకమైన కర్తార్‌పూర్ కారిడర్ తెరుచుకుంది. సిక్కుల గురువు గురునానక్
550వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ కర్తార్‌పూర్ కారిడర్‌ను ప్రారంభించారు. గురుదాస్‌పూర్‌లోని డేరా బాబా నానక్ వద్ద భారత్ వైపున ఉన్న కారిడార్‌ను ప్రారంభించారు. పాకిస్థాన్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాకు నేరుగా వెళ్లడానికి వీలు కల్పించడానికి పంజాబ్ సరిహద్దులో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టును ఓపెన్ చేశారు.
ఇక.... మూడు దశాబ్దాల క్రితం ఇదే నవంబర్ 9న బెర్లిన్ గోడ బద్దలైంది. రెండో ప్రపంచయుద్ధంలో విజేతలుగా నిలిచిన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, సోవియట్ యూనియన్.. ఓడిపోయిన జర్మనీని విభజించాలని నిర్ణయించాయి. తూర్పు జర్మనీ నుంచి వలసలను అడ్డుకొనేందుకు బెర్లిన్ గోడ నిర్మించాలని ఆదేశించారు. 1961 ఆగస్టు 13 రాత్రి కొన్ని గంటల వ్యవధిలోనే బెర్లిన్ గోడను నిలబెట్టారు. మూడున్నర మీటర్లకు పైగా ఎత్తైన బెర్లిన్ గోడను స్టీలు కేబుళ్లు వాడి దృఢంగా నిర్మించారు. బెర్లిన్‌ను ఈ గోడ దాదాపు మూడు దశాబ్దాలు విడగొట్టింది. అయితే.. ఇదే నవంబర్ 9న .బెర్లిన్ గోడ బద్దలు చేశారు. ఇరవయ్యో శతాబ్దపు కీలక ఘట్టాల్లో ఇది ఒకటిగా నిలిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com