అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదం ఇంకా సద్దుమణగలేదా..?

అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదం ఇంకా సద్దుమణగలేదా..?
X

trump

చైనా ఉత్పత్తులపై సుంకాలు ఎత్తివేసే దిశగా తమ దేశంతో ఎలాంటి ఒప్పందం కుదరలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టంచేశారు. సుంకాల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చైనా కోరినట్టు తెలిసిందని.. కానీ ఈ అంశంపై వారితో ఎలాంటి చర్చలు జరపలేదని ట్రంప్‌ చెప్పారు. తాను దానికి ఒప్పుకోనని వారికి తెలుసునని.. అందుకే సుంకాల ఎత్తివేత వార్తలను ఖండిస్తున్నట్లు ట్రంప్‌ చెప్పారు. ప్రస్తుతం చైనా ఆర్ధికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుందనీ, అందుకే ఇలాంటి ఒప్పందాలను చేసుకోవాలని ప్రయత్నిస్తోందని ఆయన వివరించారు.

ఇరు దేశాల మధ్య సుంకాలను దశలవారిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్టు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి గావో ఫెంగ్‌ గతవారమే ప్రకటించారు. ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు నిర్మాణాత్మక చర్చలు జరిపారని.. అదనంగా విధించిన సుంకాలను దశలవారీగా వెనక్కి తీసుకునేందుకు అంగీకరించడంతోపాటు తుది ఒప్పందం దిశగా అడుగులు వేశారని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. ఫేజ్‌-1 ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల సమాన నిష్పత్తిలో ఒకేసారి గతంలో విధించిన సుంకాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు గావో తెలిపారు. ఒప్పందం చేరుకోవడానికి ఇదే ప్రధానమైన షరతు అని ఆయన అన్నారు. సుంకాలతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. వాటి రద్దు చేయడంతోనే వాణిజ్య యుద్ధం పూర్తవుతుందని అన్నారు. గావో ప్రకటన తర్వాత దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం సమసిపోతుందని అంతా భావించారు. కానీ, తాజాగా ట్రంప్‌ చేసిన ప్రకటనతో మళ్లీ ఈ వివాదం ఇంకా సద్దుమణగలేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అటు ట్రంప్‌ తాజా ప్రకటనతో ఆందోళన మరింత పెరిగిందంటున్నారు.. చైనా ప్రకటన తర్వాత ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి.. తాజా పరిణామాలతో మార్కెట్లు మళ్లీ ఎలా రియాక్ట్‌ అవుతాయన్నది ఆందోళన కలిగిస్తోంది.

Tags

Next Story