బోర్డు రాజ్యంగ సవరణ జరిపితే ఆరేళ్లపాటు అధ్యక్షుడిగా గంగూలీ?

బిసిసిఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ సిక్సర్ కొట్టడానికి రెడీ అవుతున్నారు.. ఇప్పటికే ఇన్నింగ్స్ మొదలుపెట్టిన దాదా.. బోర్డు పిచ్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి అడుగులు వేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. 9నెలల గండం దాటుకుని.. ఆరేళ్లపాటు తిరుగులేని నాయకుడిగా అవతరించే ఛాన్సుంది.
బిసిసిఐ అధ్యక్షునిగా కొత్తగా ఎన్నికైన సౌరవ్ గంగూలీ పదవీ కాలం తొమ్మిది నెలల్లో ముగుస్తుంది. ప్రస్తుతం నిబంధనల ప్రకారం మాజీ కెప్టెన్ 9నెలల తర్వాత అనర్హుడు అవుతారు. అయితే నిబంధనలు సవరించి పదవీకాలాన్ని పొడిగించే ఆలోచనలో ఉన్నారు బిసిసిఐ పెద్దలు. వచ్చే నెలలో గంగూలీ నేతృత్వంలో సాధారణ వార్షిక సమావేశం జరగనుంది. సుప్రీంకోర్టు ఆమోదించిన బిసిసిఐ రాజ్యాంగాన్ని సర్వసభ్య సమావేశంలో సవరించనున్నారు. ఈ ప్రతిపాదనకు బిసిసిఐ పాలకవర్గంలో నాలుగింట మూడోవంతు మద్దతు అవసరం కావాలి. సుప్రీంకోర్టు ఆమోదం కూడా తప్పనిసరి.
ప్రస్తుత నిబంధనల ప్రకారం గంగూలీ తొమ్మిది నెలలపాటే బిసిసిఐ అధ్యక్షుడిగా కొనసాగిగాల్సి ఉంది. రెండోసారి ఆ పదవిలో కొనసాగాలంటే మూడేళ్ళ విరామం ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో బిసిసిఐ పాలకవర్గం ఆ నిబంధనను తొలగించే ఆలోచనల్లో ఉంది. ఈ ప్రతిపాదనలకు BCCI లో మెజార్టీ సభ్యులు కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. ముందుగా సుప్రీంకోర్టు ఆమోదించిన తర్వాత.. బిసీసీఐ రాజ్యాంగాన్ని సాధారణ వార్షిక సమావేశంలో సవరిస్తారు. దీంతో గంగూలీ వరసగా ఆరేళ్ల పాటు బిసిసిఐ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశాలు మెరుగుపడతాయి.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com