చంద్రయ్యకు చికిత్స కరువాయె..

చంద్రయ్యకు చికిత్స కరువాయె..

chandu

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దారు విజయారెడ్డిని కాపాడబోయి తీవ్రంగా గాయపడిన అటెండర్ చంద్రయ్యకు.. అధికారులు, ఆస్పత్రి యాజమాన్యం నరకం చూపిస్తోంది. అపోలో-DRDO ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించగా.. బిల్లు కట్టడం లేదంటూ వైద్యులు చికిత్సకు నిరాకరిస్తున్నారు. వేరే హాస్పిటల్‌కు వెళ్లండని తేల్చి చెప్తున్నారు.

ఆ రోజు చంద్రయ్య ధైర్యాన్ని అంతా మెచ్చుకున్నారు. మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. అపోలో-DRDO ఆస్పత్రి యాజమాన్యం మాత్రం చంద్రయ్యకు వైద్య సహాయం అందించాలని అధికారుల నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని చెప్తోంది. ఖరీదైన చికిత్స ఇవ్వలేమని చేతులెత్తేస్తోంది. వైద్య ఖర్చులు భరించలేక అటెండర్‌ కుటుంబం తల్లడిల్లుతోంది. ప్రభుత్వాసుపత్రికి వెళ్తే చంద్రయ్య కోలుకోవడం కష్టమని అంటున్నారు.

మహిళా తహసీల్దారును.. ఓ ఉన్మాది పెట్రోల్‌ పోసి తగలబెడితే.. ప్రాణాలకు తెగించి కాపాడే ప్రయత్నం చేశాడు అటెండర్‌ చంద్రయ్య. ఇప్పుడతని ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. అపోలో-DRDO హాస్పిటల్‌లో చికిత్సకు ఎక్కువ ఖర్చు అవుతోందంటూ.. మంగళవారం రాత్రి సమయంలో హడావుడిగా ఒవైసీ ఆస్పత్రికి షిఫ్ట్‌ చేశారు. ఇదేం పద్ధతంటూ మీడియాలో కథనాలు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే చంద్రయ్యను మళ్లీ అపోలో-DRDO ఆస్పత్రికి తీసుకొచ్చారు. అందరూ హమ్మయ్య అనుకున్నా.. ఉదయానికి సీన్‌ మళ్లీ మొదటికొచ్చింది.

తెల్లవారుజాము నుంచే ఆస్పత్రి యాజమాన్యం పాతపాట పాడుతోంది. దీంతో.. చంద్రయ్య కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story