కాచిగూడ రైలు ప్రమాదంలో భారీ నష్టం చవిచూసిన రైల్వేశాఖ

కాచిగూడ రైలు ప్రమాదంలో భారీ నష్టం చవిచూసిన రైల్వేశాఖ

kaci

హైదరాబాద్ MMTS చరిత్రలోనే తొలి ప్రమాదం మిగిల్చిన నష్టం కూడా భారీగానే ఉంది. కాచిగూడ వద్ద సోమవారం ఎంఎంటిఎస్ రైల్.. కర్నూలు- సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన ఘటన వల్ల రైల్వే శాఖకు 12 కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో MMTS డ్రైవర్ కేబిన్‌తో పాటు.. మొత్తం 7 బోగీలు ధ్వంసమయ్యాయి. ఇంటర్ సిటీ బోగీలు నాలుగు పాడయ్యాయి. ఈ బోగీల నష్టమే 12 కోట్లు ఉంటుందని.. పూర్తిస్థాయిలో విచారణ చేస్తే ఇది మరింత పెరుగుతుందని చెప్తున్నారు.

ప్రమాదం చూడటానికి చిన్నదిగా కనిపించినా.. నష్టం మాత్రం భారీగానే ఉందని.. సర్వీసులు నిలిచిపోవడం వల్ల ఆదాయంపై కూడా ప్రభావం చూపిందని అధికారులు అన్నారు. ఇక పునరుద్ధరణ చర్యలకు కూడా భారీగానే వ్యయమవుతోంది. గాయపడ్డ బాదితులకు వైద్య ఖర్చులు రైల్వేశాఖ భరిస్తోంది. ప్రమాదం కారణంగా పలు రైళ్లకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎంఎంటీఎస్ మంగళవారం వరకూ సర్వీసులు నిలిపివేసింది. బుధవారం సిటీలో అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచే సాధారణ రైళ్లు సమయానికి నడవడం మొదలుపెట్టాయని రైల్వేశాఖ ప్రకటించింది.

అటు ప్రమాదంలో గాయపడ్డ లోకో పైలెట్ చంద్రశేఖర్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం కేర్ ఆసుపత్రిలో వెంటిలెటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం లోకోపైలెట్ శేఖరే కారణమని రైల్వే అధికారులు ప్రాధమిక నిర్దారణకు వచ్చారు. సిగ్నల్ ఇవ్వకుండానే ముందుకు వెళ్లినట్టు తెలుస్తోంది. అంతేకాదు లోకోపైలెట్ పై చర్యలు తీసుకోవాలని కాచిగూడ స్టేషన్ మేనేజర్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. లోకో పైలెట్ కోలుకుంటే వాంగ్మూలం తీసుకునే అవకాశం ఉంది. స్టేషన్ మాస్టర్ తో పాటు సిగ్నలింగ్ వ్యవస్థలో పనిచేసే ఏడుగురిని విచారిస్తున్నారు.

అటు రైల్వే సేఫ్టీ కమిషనర్ రాంకృపాల్ కూడా ప్రమాద ఘటనపై విచారణ జరపనున్నారు. ప్రత్యక్ష సాక్షులు, ప్రయాణికుల నుంచి ప్రమాదంపై వివరాలు సేకరిస్తారు. అలాగే వివిధ విభాగాలకు చెందిన అధికారులతోనూ సమావేశమవుతారు. ఎదురుగా రైలు కనిపిస్తున్నా.. లోకోపైలెట్ చంద్రశేఖర్ రైలు ఎలా ముందుకు పోనిచ్చారన్నది అధికారులకు అంతుచిక్కడం లేదు. దీనిపై శేఖర్ నోరు విప్పితే కానీ వాస్తవాలు వెలుగుచూసే అవకాశం లేదు.

Tags

Next Story