ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసా...గిస్తున్న 'మహా'పార్టీలు


మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనపై శివసేన భగ్గుమంటోంది. అటు ఎన్సీపీ, కాంగ్రెస్ కూడా రాష్ట్రపతి పాలనపై మండిపడుతున్నాయి. నాలుగు అంశాలను గవర్నర్ విస్మరిచారని కాంగ్రెస్ విమర్శిస్తే.. రాష్ట్రపతి పాలనపై శివసేన హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు రాష్ట్రపతి పాలన విధించినా ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
మహా రాజకీయం ముగిసింది. దాదాపు 3వారాల మహా సీరియల్‌కు రాష్ట్రపతి పాలనతో ఎండ్ కార్డ్ పడింది. కేంద్ర కేబినెట్ తీర్మానానికి రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. పంజాబ్ పర్యటన ముగించుకొని.. ఢిల్లీ చేరుకున్న ఆయన, ప్రెసిడెంట్ రూల్ ఫైల్‌పై సంతకం పెట్టారు. దాంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చినట్లైంది. అసెంబ్లీ సుప్తచేతనావస్థలోకి వెళ్లిపోయింది. ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన అమల్లో ఉంటుంది. ఈలోపు ప్రభుత్వ ఏర్పాటుకు ఎవ్వరైనా ముందుకు వచ్చి, బలం నిరూపించుకోవచ్చు. లేకపోతే మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది.
ట్విస్ట్‌ల మీద ట్విస్టులతో మహా సీరియల్ రక్తి కట్టించింది. మంగళవారం కూడా రాజకీయం రసవత్తరంగా సాగింది. ఉదయం నుంచి పరిణామాలు చకచకా మారిపోయాయి. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిపక్షా లు మల్లగుల్లాలు పడ్డాయి. 3పార్టీలు కలిసి కొత్త సర్కారును ఏర్పాటు చేయడంపై నిర్ణయం తీసుకోలేకపోయాయి. దాంతో గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ విధించాలని కేంద్రానికి నివేదిక పంపారు. ఈ రిపోర్టుపై ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ మీటింగ్‌లో చర్చించారు. మహారాష్ట్ర పరిణామాలు, గవర్నర్ నివేదికపై సమాలోచనల అనంతరం మహారాష్ట్రలో ప్రెసిడెంట్ రూల్ విధించాలని తీర్మానించారు. అదే నిర్ణయాన్ని రాష్ట్రపతికి నివేదించారు. కేబినెట్ తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదించారు.
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు ఎందుకు సిఫారసు చేయాల్సి వచ్చిందో గవర్నర్ కార్యాలయం వివరించింది. ఫలితాలు వెలువడి 19 రోజులు గడిచినా.. ఒక్క పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేదని తెలిపాయి. రాజ్యాంగం ప్రకారం వ్యవహరించామని.. అతిపెద్ద పార్టీకి ముందు అవకాశం ఇచ్చామని గుర్తు చేశాయి. రెండో పెద్ద పార్టీ, మూడో పెద్ద పార్టీకి ఛాన్స్ ఇచ్చినా.. నిర్దేశిత గడువులోపు ఏ ఒక్కరూ ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్దత వ్యక్తం చేయలేదని గవర్నర్ వర్గాలు వివరించాయి.
రాష్ట్రపతి పాలన కోరుతూ గవర్నర్ నివేదిక ఇవ్వడానికి ఎన్సీపీ వైఖరే కారణం. ప్రభుత్వ ఏర్పాటుపై మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర లోపు నిర్ణయం చెప్పాలని గవర్నర్ కోషియారీ, ఎన్సీపీకి సూచించారు. ఐతే, ఆ గడువు సరిపోదని, డెడ్‌లైన్ పెంచాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కోరారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాశారాయన. తమకు మరో 48 గంటల అదనపు సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. అందుకు కోషియారీ ఇష్టపడలేదు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవడం సహా తాజా పరిణామాలను బేరీజు వేసి, రాష్ట్రపతి పాలనవైపు మొగ్గు చూపారు. ఆర్టికల్-356ని వర్తింపచేయాలంటూ కేంద్రానికి నివేదిక పంపించారు.
రాష్ట్రపతి పాలన-గవర్నర్ తీరుపై శివసేన భగ్గుమంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తమకు చాలా తక్కువ సమయం ఇచ్చారని శివసైనికులు విరుచుకుపడ్డారు. బీజేపీకి 2-3 రోజులు ఇచ్చి తమకు 24 గంటలే ఇచ్చారని దుయ్యబట్టారు. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై బుధవారం విచారణ జరగనుంది. అటు గవర్నర్ నిర్ణయాన్ని కాంగ్రెస్-ఎన్సీపీ తీవ్రంగా తప్పుబట్టాయి. డెడ్‌లైన్ ముగియక ముందే రాష్ట్రపతి పాలనకు ఎలా సిఫారసు చేస్తారని నిలదీశాయి. ఇది అప్రజాస్వామికమని మండిపడ్డాయి. అయితే, ప్రతిపక్షాల విమర్శలను బీజేపీ తోసిపుచ్చింది. అధికారయావలో సిద్ధాంతాలకు నీళ్లొదిలారని శివసేనపై బీజేపీ నేతలు ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన ప్రభుత్వ ఏర్పాటుపై అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ ట్విస్ట్ ఇచ్చింది. అదీ కూడా శివసేన మద్దతు ఇవ్వకపోయినా.. తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనంత మద్దతు ఉందని బీజేపీ చెబుతోంది. మంగళవారం రాత్రి మరోసారి బీజేపీ కోర్ కమిటీ సమావేశమై పనిణామాలపపై చర్చించింది. అటు శివసేన- ఎన్సీపీ-కాంగ్రెస్ కూడా ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నాయి. మంగళవారం చర్చోపచర్చలు జరిపాయి. శివసేన- ఎన్సీపీ -కాంగ్రెస్ ఎవరికి వారు లేటెస్ట్ పరిణామాలపై చర్చించారు. అయితే.. ఎన్సీపీ కూడా శివసేన ముందుకు 50-50 ఫార్మాలా తీసుకెళ్లింది. అయితే.. కాంగ్రెస్ పొత్తుపై సమాలోచనలు జరుపుతూనే ఉంది. 13 కేబినెట్ పోస్టులు తీసుకొని మద్దతు ఇవ్వాలా? లేదంటే వెలుపలి నుంచి మద్దతివ్వాలా? అనేది తేల్చుకోలేకపోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

