ఒక్కనేత పోతే.. వందమందిని తయారు చేస్తా : చంద్రబాబునాయుడు

ఏపీ ఇసుక కొరతను నిరసిస్తూ... విజయవాడ ధర్నాచౌక్‌లో 12 గంటల దీక్ష చేశారు చంద్రబాబు. ఉదయం 8 గంటలకు దీక్షా ప్రాంగణానికి వచ్చిన ఆయన.. ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్న కార్మికులకు నివాళులు అర్పించారు. మహాత్మాగాంధీ, ఎన్టీఆర్ చిత్రపటాలకు కూడా అంజలి ఘటించారు. చంద్రబాబుతో పాటు వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన భవన నిర్మాణ కార్మికులు కూడా దీక్షలో కూర్చున్నారు. టీడీపీ కార్యకర్తలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలపడంతో ధర్నా చౌక్ కిక్కిరిసిపోయింది.
రాష్ట్రంలో లాలూచీ రాజకీయాలు చేస్తూ.. కృత్రిమ ఇసుక కొరత సృష్టించారని మండిపడ్డారు చంద్రబాబు. 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నా.. ఆకలితో చనిపోతున్నా సీఎం జగన్‌కు ఎలాంటి బాధా లేదన్నారు. పేదవాడి ప్రాణం పోయినా ఫర్వాలేదు కానీ... మా నేతలు మాత్రం బాగా ఆస్తులు కూడబెట్టుకుంటే చాలన్నరీతిలో...
పాలన సాగుతోందని విమర్శించారు.. వరదల వల్లే ఇసుక కొరత వచ్చిందంటూ పిచ్చిసాకులు చెబుతున్నారని ఆరోపించారు.. చివరికి సిమెంట్ ఫ్యాక్టరీలను బెదిరించి వారిదగ్గర కూడా కమీషన్లు తీసుకున్నారంటూ ఫైరయ్యారు. రాష్ట్రంలో ప్రతిపనికి జేటాక్స్ కట్టే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు..
ఇసుకపై దీక్ష చేస్తుంటే...తమ నేతలను పార్టీలో చేర్చుకొని....విమర్శలు చేయిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు..ఈ కుట్రలు..కుతంత్రాలు తన దగ్గర సాగవంటూ హెచ్చరించారు. ఒక్కనేత పోతే...వందమంది నాయకుల్ని తయారు చేస్తానని స్పష్టం చేశారు..సీఎం జగన్ రాజకీయాలంటే తమాషా అనుకుంటున్నారని విమర్శించారు...
వైసీపీ ప్రభుత్వం తీరుతో పెట్టుబడిదారులు భయపడిపోతున్నారని అన్నారు చంద్రబాబు. ఇప్పటికే అనేక కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయని చెప్పారు. గొప్ప సంకల్పంతో అమరావతి ఏర్పాటును సంకల్పిస్తే.. దాన్ని కూడా నాశానం చేశారని ఫైరయ్యారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ బొక్కలు వెతుకుతున్నారని ఫైరయ్యారు..
ఇసుక సమస్యపై పవన్ లాంగ్ మార్చ్ చేస్తే వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమన్నారు చంద్రబాబు. ఎవరైనా ప్రశ్నిస్తే ఎదురు కేసులు పెడుతామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు..
ఏపీలో ప్రజాస్వామ్యమే లేకుండా పోయిందని విమర్శించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడికి 10 వేలు ఇచ్చి ఆదుకోవాలని, ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు లోకేష్.
ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో చంద్రబాబు కాస్త నీరసానికి గురయ్యారు. దీంతో మధ్యలో వైద్యులు ఆయనకు పరీక్షలు చేశారు. షుగర్, బీపీ లెవల్స్ సాధారణంగానే ఉన్నాయని తెలిపారు. మంచినీళ్లు తాగాలని సూచించినా తాను బాగానే ఉన్నానంటూ తిరస్కరించారు చంద్రబాబు. ఇసుక దీక్షకు ప్రజల నుంచి భారీ స్పందన రావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. ఇదే జోరుతో ప్రభుత్వంపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com