మద్యం మత్తు: రైలు పట్టాలపై తెల్లారిన విద్యార్థుల జీవితం..


గవర్నమెంట్ కాలేజీలో సీటు రాకపోయినా పిల్లల భవిష్యత్ కోసమని బోలెడు ఫీజులు కట్టి ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో చేర్పించారు. స్నేహితులు, సరదాలు అంటూ వారు చేసిన పని అమ్మానాన్నలకు పుత్ర శోకాన్ని మిగిల్చింది. ఆ నలుగురు విద్యార్థుల జీవితం రైలు పట్టాలపై ముగిసిపోయింది. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు డి. సిద్ధిఖ్ రాజా (22), రాజశేఖర్ (20), ఎం. గౌతం (23), కురుస్వామి (24)లు సూలూరులోని రౌతర్ పాలెం రైల్ ఓవర్ బ్రిడ్జి సమీపంలోని రైలు పట్టాల మీద కూర్చుని మద్యం తాగుతూ మత్తుగా పడుకున్నారు. అంతలో అటుగా అదే ట్రాక్‌పై వస్తున్న చెన్నై-అల్లప్పుంజా ఎక్స్‌ప్రెస్ రైలు వీరిపై నుంచి వెళ్లింది. దీంతో నలుగురు విద్యార్థులు రైలు పట్టాల కింద నలిగిపోయారు. విఘ్నేష్ అనే మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. రైలు కిందపడి మరణించిన నలుగురు విద్యార్థుల మృతదేహాలను కోయంబత్తూర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. విద్యార్థులు రైల్వే ట్రాక్‌పై కూర్చొని మద్యం తాగుతుండడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలమైన రైల్వే ట్రాక్‌పై మద్యం బాటిళ్లు, ప్లాస్టిక్ గ్లాసులు పోలీసులకు లభించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

