స్పీడ్ పెంచితే.. గన్‌కి చిక్కినట్లే

స్పీడ్ పెంచితే.. గన్‌కి చిక్కినట్లే

orr

హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డుపై దూసుకెళ్తున్నారా? ఎదురుగా వచ్చే వాహనాలు ఉండవు.. ట్రాఫిక్‌ పోలీసులు కనిపించరని బిందాస్‌గా వెళ్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఆలోచించుకోండి. హీరో రాజశేఖర్‌ కారు బోల్తా ఘటనతో.. వాహనాల ఓవర్ స్పీడుకు కళ్లెం వేయడంపై పోలీసులు దృష్టి సారించారు. ఔటర్ రింగ్‌ రోడ్‌పై స్పీడ్‌ గన్లు ఏర్పాటు చేశారు. కారు వేగం వంద దాటితే మీరు ఆ గన్‌లకు చిక్కినట్టే!

ఔటర్‌ రింగ్‌ రోడ్ ఎంత సౌకర్యవంతమో.. అంత ప్రమాదకరం కూడా. నిత్యం ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాయువేగంతో దూసుకెళ్లే వాహనాలే ఇందుకు కారణం. బుధవారం రాజశేఖర్‌ కారు కూడా పల్టీలు కొట్టింది. ఆ ప్రమాదం జరిగిన తీరు.. సగటు మనిషిని ఉలిక్కిపడేలా చేస్తోంది. 180 స్పీడ్‌లో సినిమా స్టంట్‌ను తలపించేలా యాక్సిడెంట్ జరిగింది. అదుపుతప్పి గాల్లోకి లేచింది. డివైడర్‌ పైకి దూసుకెళ్లింది. పల్టీలు కొట్టింది. 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. లక్కీగా.. కారులోని ఎయిర్‌ బెలూన్స్‌ ఓపెన్ కావడంతో రాజశేఖర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది. మరోసారి ఇలాంటి ఘోరాలు చోటు చేసుకోకుండా స్పీడ్‌ గన్లు ఏర్పాటు చేసింది.

ఔటర్‌పై ఓవర్‌స్పీడ్‌తో దూసుకెళ్తున్న వాహనాలపై పోలీసులు కన్నేశారు. రాజశేఖర్ కారు ఎక్కడైతే ప్రమాదానికి గురైందో అక్కడి నుంచే స్పీడ్‌గన్ల ఏర్పాటు మొదలైంది. ORRలో పలుచోట్ల స్పీడ్‌గన్లు రానున్నాయి. అయితే.. స్పీడ్‌గన్లు చెట్ల మధ్య ఉండడంతో.. వాహనదారులకు ఈ విషయం తెలీదు. గంటకు వంద కిలోమీటర్ల వేగం దాటి దూసుకెళ్తున్న వాహనాలకు భారీ జరిమానా విధించనున్నారు. విలువైన ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఈ ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story