రాఫెల్ డీల్‌లో సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి: కాంగ్రెస్

రాఫెల్ డీల్‌లో సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి: కాంగ్రెస్
X

rah

రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రివ్యూ పిటిషన్లన్నింటిని కోర్టు తిరస్కరించింది. 59వేల కోట్ల విలువైన యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను అణచిపెట్టి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలతో సుప్రీంతీర్పుని సవాల్‌ చేస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్, అరుణ్‌ శౌరి, యశ్వంత్‌సిన్హాలు రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. వీటిని విచారించిన న్యాయస్థానం పిటిషన్లలో ఎలాంటి బలమైన వాదన కనిపించలేదని డిస్మిస్ చేసింది. కోర్టు పర్యవేక్షణలో విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది.

దీంతో పాటు రాహుల్‌గాంధీపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కూడా ధర్మాసనం కొట్టివేసింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందికి వస్తాయంటూ బీజేపీ నేత మీనాక్షి లేఖి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్‌ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో దీనిపై ప్రోసీడింగ్స్ అవసరం లేదని అభిప్రాయపడింది. ఇకముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సుప్రీం సూచించింది. రాహుల్ గాంధీ చేసిన 'చోర్‌' లాంటి వ్యాఖ్యలపైనా సుప్రీంకోర్టు సున్నితంగా మందలించింది. ఈ వ్యాఖ్యలు దురదృష్టకరమని ధర్మాసనం అభిప్రాయపడింది. చౌకీ దార్‌ చోర్‌ వ్యాఖ్యలను రాహుల్‌ తమకు ఆపాదించడం దురదృష్టకరమనీ.. ఆయన భవిష్యత్‌లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలంటూ సూచించింది కోర్టు. ఆయనపై దాఖలైన పరువునష్టం కేసును కొట్టేసింది.

అటు రాఫేల్ కేసులో నిజం గెలిచిందని.. బీజేపీ నాయకులన్నారు. రాఫేల్ కేసులో తప్పుడు ప్రచారం చేసిన రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. కోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాంటిదన్నారు.

తాజా తీర్పుపై కాంగ్రెస్ ఆచితూచి స్పందించింది. దీనిపై సమీక్షిస్తామని... పార్టీలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు. అయితే రఫేల్ డీల్లో ఇంకా సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయని.. ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇస్తూ 2018 డిసెంబర్‌ 14న తీర్పు వెలువరించింది. అయితే, తీర్పుని మే 10న ధర్మాసనం రిజర్వ్‌లో పెట్టింది. దీనిపై దాఖలైన సమీక్ష పిటీషన్‌ను కొట్టి వేస్తూ తాజాగా రాఫెల్‌ డీల్‌ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు లేవని నిర్ధారించింది.

Tags

Next Story