శబరిమల తీర్పుకు వేళాయే..

శబరిమల తీర్పుకు వేళాయే..
X

sabar

హిందూ ధర్మంలో సంప్రదాయాలు ఎక్కువ. ఇంట్లో ఉన్న దేవుడి గదిలోకి వెళ్లాలంటేనే సవాలక్ష నియమాలు ఉంటాయి. స్నానం చేసి శుచిగా వెళ్లాలి. ఈ విషయంలో కుటుంబమంతా నిబంధనలు పాటించేలా మహిళలు కూడా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. ఊళ్లో ఉన్న ఆలయానికి వెళ్లాలన్నా ఇవే నియమాలు వర్తిస్తాయి. అలాంటిది.. మహిమలతో కూడుకున్న క్షేత్రానికి వెళ్లాలంటే.. ఇంకెంతటి ఆచారాలను అనుసరించాలి? ప్రపంచంలో ఉన్న అన్ని అయ్యప్ప ఆలయాలలోకి మహిళలకు అనుమతి ఉంటుంది. పూజలు చేయచ్చు. వ్రతాలు ఆచరించవచ్చు. దైవ కార్యక్రమాలు అన్నింటిలోనూ పాల్గోవచ్చు. కానీ, శబరిమల క్షేత్రం పరిస్థితి వేరు. ఇక్కడ ప్రాచీన నియమాలు కొన్ని ఉన్నాయి. అవి ఆలయం కట్టినప్పటి నుంచి అమల్లో ఉన్నాయి. వాటిని తరతరాలుగా ఆచరిస్తున్నారు. ఇదంతా భక్తుల మనోభావాలకు సంబంధించింది.

మనదేశంలో ఒక్కో ప్రాంతంలో ఉన్న ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. శబరిమలలో ఉన్న అయ్యప్ప ఆలయం కూడా ఇదే కోవలోకి వస్తుంది. శబరిమలలో కొలువైన అయ్యప్ప నైష్టిక బ్రహ్మచారి. అందుకే ఆయన్ని పూజించుకోవాలంటే బ్రహ్మచర్యం పాటించాలన్న నిబంధన ఉంది. అయ్యప్ప మాల వేసుకున్నవాళ్లు నిష్టగా దీక్ష ఆచరిస్తారు. నిజానికి వాళ్లకు కావలసిన పూజాద్రవ్యాల నుంచి.. దీక్ష ముగిసేవరకు మహిళల ప్రమేయం లేకుండా ఉండదు. మాల వేసుకుంది స్వాములే అయినా.. వాళ్లకు అవసరమైన సమస్తం సమకూర్చాల్సింది ఇంట్లో ఉండే మహిళలే. కానీ, కేవలం క్షేత్ర నిబంధనలు మాత్రమే 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారికి శబరిమలో స్వామి దర్శనానికి నిరాకరిస్తున్నాయి. అయ్యప్ప దర్శనానికి ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు రెండు కోట్లమంది భక్తులు వస్తారు. ఇందులో మణికంఠలు అంటే 10 ఏళ్ల లోపున్న వయసువారు కూడా ఉంటారు. వాళ్లకు ఎలాంటి నియమ, నిబంధనలు అడ్డురావు. కేవలం నిషేధిత వయస్కులకు మాత్రమే ప్రవేశం ఉండదు. యంత్రతంత్ర సిద్ధులతో మంత్రబద్ధం చేసి ఉన్న శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశించకూడదన్నది ఈనాటిది కూడా కాదు.

అయితే, శబరిమలలో మహిళలపై ఈ సంప్రదాయాన్ని కొందరు అభ్యుదయవాదులు ప్రశ్నించడంతో వివాదం రాజుకుంది. ప్రజాస్వామ్యంలో అందరికీ సమానహక్కులు ఉన్నప్పుడు మహిళలు శబరిమల ఆలయ ప్రవేశం చేసేందుకు హక్కు ఎందుకివ్వరన్నది వారి వాదన. శబరిమలలో ఈ నిషేధం ముమ్మాటీకీ మహిళలపై కొనసాగుతున్న వివక్షతకు నిదర్శనమని అంటున్నారు. అయితే.. సంప్రదాయవాదులకు ఈ అభ్యుదయ వాదనతో పొసగటం లేదు. ఇక్కడ సమానహక్కుల కోణంలో కాకుండా కోట్లాది మంది విశ్వాసాలను పరిగణలోకి తీసుకోవాలన్నది భక్తుల వాదన. ఒకానొక దశలో అయ్యప్పకు కూడా రాజ్యంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం హక్కలు ఉంటాయి అనేంత వరకు వాదనలు వెళ్లాయి.

శబరిమల ఆలయంలో మహిళలపై నిషేధాన్ని సవాల్ చేస్తూ తొలిసారిగా 2006లో పిటిషన్ దాఖలైంది. యంగ్ లాయర్స్ అసొసియేషన్ సుప్రీం కోర్టు పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ముందు ట్రావెన్ కోర్ దేవస్వోం బోర్డు కూడా తమ వాదన వినిపించింది. పదమూడేళ్ల సుదీర్ఘ విచారణలో ఇరు వర్గాల వాదనలు విన్న చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. గతేడాది సెప్టెంబర్ 28న తుది తీర్పును వెలువరించింది. శబరిమల ఆలయంలోకి వయసుతో నిమిత్తం లేకుండా మహిళలు అందరికి ప్రవేశం కల్పిస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది. ఆలయంలోకి మహిళ ప్రవేశాన్ని అడ్డుకోవటం.. ఆర్టికల్‌ 14, 25ను ఉల్లంఘించటమేనని స్పష్టం చేసింది. ఆలయాల్లో లింగ వివక్షకు తావు లేదని, మహిళలను తక్కువగా, బలహీనులుగా చూడడానికి వీల్లేదన్నారు చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా.

అయితే ఆనాటి తీర్పులో ఐదుగురు సభ్యుల బెంచ్‌‌లో నలుగురు జడ్జిలు శబరిమల ఆలయంలోకి మహిళ ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయటాన్ని సమర్ధించగా... బెంచ్‌లోని ఏకైక మహిళ జడ్జి ఇందూ మల్హోత్ర మాత్రం తీర్పుతో విభేదించారు. రుతుస్రావ సమయంలో ఆలయంలోకి ప్రవేశించటం సరికాదన్నారు. సతీసహగమనం లాంటి సామాజిక రుగ్మతలు మినహా ఆలయ ఆచార వ్యవహారాల్లో అనవసర జోక్యం తగదన్నారు. దేశంలో లౌకిక వాతావరణాన్ని కల్పించేందుకు బలంగా నాటుకుపోయి ఉన్న మతపరమైన ఆచారాల్లో మార్పు చేయొద్దన్నారు. ఆలయ ఆచార వ్యవహారాలపై నమ్మకం లేని వారికి ఆలయంలోకి ప్రవేశం కోరే హక్కు ఎక్కడుందని జస్టిస్‌ ఇందూ మల్హోత్రా ఆనాటి తీర్పులో అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే.. సుప్రీం వెలువరించిన సంచలన తీర్పుపై పెను దుమారమే చెలరేగింది. హిందూ భక్తుల విశ్వాసాలను ప్రశ్నించేలా వెల్లడైనా తీర్పుపై కేరళ అట్టుడికిపోయింది. సుప్రీం తీర్పును అమలు చేసేందుకు కేరళ ప్రభుత్వం కూడా దాదాపుగా విఫలయత్నమే చేసింది. ఇప్పటి పినరయి ప్రభుత్వానికి ముందు ఉన్న ప్రభుత్వం ట్రావెన్ కోర్ దేవస్థానాకి మద్దతుగా ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించటాన్ని సమర్ధిస్తున్నట్లు అఫిడవిట్లో తెలిపింది. కానీ, సీపీఎం ప్రభుత్వం మాత్రం ఆలయంలోకి మహిళలను అనుమతిస్తే తమకేమి అభ్యంతరం లేదని అఫిడవిట్లో స్పష్టం చేసింది. అంతేకాదు.. సుప్రీం తీర్పును అమలు చేసి తీరుతామని ఖరాకండిగా చెప్పేసింది. మరోవైపు ఆలయంలోకి మహిళలు వెళ్లేందుకు జరిగిన ప్రయత్నాలు ఉద్రిక్తతను మరింత పెంచేశాయి. ఈ ఉద్రిక్తల నడుమ పోలీసు బందోబస్తుతో బిందు, కనకదుర్గ అనే మహిళలు అయ్యప్పను దర్శించుకున్నారు. కేరళలో సీపీఎం ప్రభుత్వం హిందువుల మనోభావాలను కించపరిచేలా మొండిగా మహిళలను ఆలయంలోకి తీసుకెళ్లిందనే ఆరోపణతో బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో భక్తి విశ్వాసాల సమస్య పొలిటికల్ టర్న్ తీసుకుంది. సీపీఎం వర్సెస్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది.

మరోవైపు సుప్రీం తీర్పును పున:సమీక్షించాలంటూ పదుల సంఖ్యలో రివ్యూ పిటీషన్లు వచ్చిపడ్డాయి. ట్రావెన్ కోర్ దేవస్వోమ్ బోర్డుతో పాటు మొత్తం 64 పిటీషన్లు దాఖలయ్యాయి. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నారీమన్, జస్టిస్ కన్విల్కర్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం రివ్యూ పిటీషన్లపై విచారణ జరిపి ఫిబ్రవరి 6న తీర్పును రిజర్వ్ చేసింది. అయితే.. అయోధ్య తీర్పులో కోట్లాది భక్తుల విశ్వాసాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం శబరిమల విషయంలో ఎలాంటి తీర్పును వెలువరిస్తుందన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.

Tags

Next Story