రాఫెల్ రచ్చకు చెక్ పడుతుందా?


మోదీ ప్రభుత్వాన్ని వెంటాడుతున్న రాఫెల్ కుంభకోణంలో సుప్రీం కోర్టు గురువారం తీర్పు ఇవ్వనుంది. గతంలో కేంద్రానికి క్లీన్ చిట్ ఇచ్చినా.. ఆనాటి తీర్పుపై రివ్యూ పిటీషన్లు దాఖలు కావటంతో విచారణకు స్వీకరించింది సుప్రీం. ఇరు వర్గాల వాదనల తర్వాత నవంబర్ 14న తీర్పు రిజర్వ్ చేసింది.
దేశ రాజకీయాల్లో సంచలనం రేపిన రాఫెల్ వివాదం మూడేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ కేసు విచారణ సందర్భంగా జరిగిన వాదనల్లో ఎన్నో మలుపులు చోటు చేసుకుంది. ఈ వ్యవహారం రాజకీయంగా పెను దుమారాన్నే రేపింది. సుప్రీం విచారణలోనూ ఇరు వర్గాల వాదనల్లో అనూహ్య లాజిక్కులెన్నో తెరమీదకు వచ్చాయి. చివరికి ఈ డీల్ లో అవకతవకలు జరగలేదంటూ 2018 డిసెంబర్ 14నే సుప్రీం కోర్టు తీర్పు వెలువరించినా.. రివ్యూ పిటిషన్లు దాఖలవటంతో కేసును మరోసారి విచారించాల్సి వచ్చింది.
నిజానికి ప్రాన్స్ తో రాఫెల్ డీల్ ఒప్పందం ప్రతిపాదన 19 ఏళ్లకు ముందునాటి మాట. ఫ్రాన్స్ నుంచి యుద్ధ విమానాలు కొనాలని 2000 సంవత్సరంలో వాజపేయి సర్కారు నిర్ణయించింది. ఆ తర్వాత సంబంధిత ప్రతిపాదనలను 2007లో యూపీఏ హయాంలో సిద్ధం చేశారు. రాఫెల్, టైఫూన్ విమానాలను కేంద్రం 2011లో షార్ట్‌లిస్ట్ చేసింది. ధర తక్కువ కావడంతో రాఫెల్ కొనాలని 2012లో నిర్ణయించారు. డీల్ ప్రకారం రెడీ టూ ఫ్లై స్టేజ్ లో ఉన్న 18 విమానాలను వెంటనే ఇండియాకు అందించాలి. మిగిలిన 108 యుద్ధ విమానాలను బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్-HALలో తయారు చేసేలా ఆనాడు ఒప్పందం కుదిరింది. కానీ, రెండు దేశాల్లోనూ ప్రభుత్వాలు మారటంతో డీల్ క్యాన్సిల్ అయింది. 2015 సెప్టెంబరులో మోడీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లడానికి మూడు నెలల ముందే కొత్త ఒప్పందానికి లైన్ క్లియర్ చేశారు. 36 విమానాల కొనుగోలు విషయాన్ని ఫ్రాన్స్ పర్యటనలో మోదీ ప్రకటించారు.
అయితే.. ఒప్పందంలో అడుగడుగునా అక్రమాలే జరిగాయన్నది విపక్షాల ఆరోపణ. ఫ్రాన్స్‌కి చెందిన డసాల్ట్‌తో కుదిరిన ఒప్పందంలో అనిల్ అంబానీ సంస్థను ఆఫ్‌సెట్ పార్ట్‌నర్‌గా చేసుకోవడం వెనుక 30 వేల కోట్ల అవినీతి దాగుందని విపక్షాలు ఆరోపించాయి. రాఫెల్ విమానాల ధరలను ఉద్దేశపూర్వకంగానే పెంచినట్లు, అనిల్ అంబానీ సంస్థలకు లాభం చేకూర్చే లక్ష్యం, దేశభద్రతకు సంబంధించిన ఒప్పందంలో ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి గానీ, బ్యాంకు నుంచి గానీ ఎలాంటి గ్యారెంటీ లేకపోవటం, సాంకేతిక బదలాయింపుపై సరైన అవగాహన లేకపోవటంపై ప్రధాన ఆరోపణలు వచ్చాయి. పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థను ఇన్వాల్వ్ చేయకుండా అనిల్ అంబానీ సంస్థను ఆఫ్ సెట్ పార్ట్ నర్ గా చేసుకోవటం వెనక ఉద్దేశం ఏంటని ప్రశ్నించాయి. ఈ వాదనలతో ఒప్పందం వివరాలను బహిర్గతం చేయాలని అటు సుప్రీం కోర్టు, పార్లమెంట్ లో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే.. దేశభద్రత దృష్ట్యా డసాల్ట్ తో కుదిరిన ఒప్పందం వివరాలను బహిర్గతం చేయలేమని కేంద్రం వాదించింది. ఇదే సమయంలో ఒప్పందం వివరాలు ఓ ఆంగ్ల పత్రికలో ప్రచురితం కావటం మోదీ ప్రభుత్వాన్ని మరోసారి ఇరుకున పడేసింది. దీనికితోడు అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు అనుబంధంగా రిలయన్స్ ఫ్లాగ్ అట్లాంటిక్ ఫ్రాన్స్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీకి ఫ్రాన్స్ ప్రభుత్వానికి 1200 కోట్ల బకాయి ఉండగా.. రఫెల్ డీల్ కుదరగానే ఆ బాకాయిని మాఫీ చేసినట్లు ఫ్రెంచి పత్రిక 'లె మాండ్' ప్రచురించిన కథనం ఇండియాలో సంచలనం సృష్టించింది. అయితే..కేంద్రం డిఫెన్స్ లో పడిందనుకున్న దశలో ఒప్పందం పత్రాలను చోరీ అయ్యాయని కేంద్రం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.
ఆ తర్వాత రఫెల్ ఒప్పందం సజావుగానే ఉందంటూ కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. అటు సుప్రీంలోనూ కేంద్రానికి ఊరట లభించింది. కేంద్రం అందించిన సీల్డ్ కవర్ వివరాలను పరిశీలించిన సుప్రీం గతేడాది డిసెంబర్ 14న కేంద్రానికి క్లీన్ చిట్ ఇస్తూ.. తీర్పునిచ్చింది. రాఫెల్ ఒప్పందంలో జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. రాఫెల్ డీల్‌కు వ్యతిరేకంగా దాఖలైన 36 పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ విమానాల ధరలను దేశభద్రత దృష్ట్యా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
ఆ తర్వాత సుప్రీం వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్‌లు రివ్యూ పిటిషన్లు వేశారు. రాఫెల్ డీల్‌లో అవినీతిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వాదనలు వినిపించిన ప్రశాంత్ భూషణ్ కేంద్రం తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఒప్పందంలో కంటికి కనబడని చాలా విషయాలు దాగున్నాయని, కొత్త నిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు. కాగ్ నివేదిక రాకముందే కేంద్రం ప్రస్తావించారని.. కీలక సమాచారాన్ని న్యాయస్థానానికి ఇవ్వలేదన్నారు. డీల్‌లో 8 కీలక నిబంధనలు పక్కన పెట్టిన విషయాన్ని కోర్టుకు తెలపలేదన్నారు. ప్రభుత్వ తాజా అఫిడవిట్‌లోనూ ఆ అంశాలు లేవన్నారు. 5 బిలియన్ యూరోలకు బెంచ్ మార్క్ ధర నిర్ణయించినా చివరి డీల్‌లో దానిపైన 55.6 శాతం ధరను పెంచారని అన్నారు. మరో పిటిషనర్ అరుణ్ శౌరి.. పత్రాలు చోరీకి గురయ్యాయన్న కేంద్రం వాదన సరైంది కాదన్నారు. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదనలు వినిపించారు. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ధరలు బహిర్గతం చేయరాదన్నారు. అందరి వాదనలు విన్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్ నేతృ త్వంలోని ధర్మాసనం విచారణ జరిపి మే 10న తీర్పును రిజర్వ్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

