కష్టాల్లో మెగాస్టార్ తొలిచిత్ర దర్శకుడు.. సాయం కోసం ఎదురుచూపు..

కష్టాల్లో మెగాస్టార్ తొలిచిత్ర దర్శకుడు.. సాయం కోసం ఎదురుచూపు..
X

punadirallu

తొలి సినిమానే చిరంజీవితో.. ఆ చిత్రంలో చేస్తుండగానే చిరంజీవికి మరో సినిమాలో అవకాశం.. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టార్‌గా మెగాస్టార్‌గా ఎదిగిపోయారు. కానీ ఆయనకు హీరోగా అవకాశం ఇచ్చిన దర్శకుడు మాత్రం ఈ రోజు మంచాన పడి ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఆర్థిక బాధలతో సతమతమవుతున్నారు. దయగల మారాజులు ఎవరైనా దయ చూపుతారేమోనని హాస్పిటల్ బెడ్‌పై ఉండి దీనంగా అర్థిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తొలిచిత్రం పునాదిరాళ్లు దర్శకుడు గూడపాటి రాజ్‌‌కుమార్ (75) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తొలి సినిమాతోనే 5 నంది అవార్డులు అందుకున్న ఘనత రాజ్‌కుమార్‌ది. సామాజిక ధృక్కోణంలో ఆయన తీసిన చిత్రాలు ప్రేక్షకులను రంజింప జేసినా ఆయనను మాత్రం ఆర్థికంగా నిలబెట్టలేకపోయాయి. ఎదిగి వచ్చిన కొడుకు అనారోగ్యంతో మరణించడం, ఆ తరువాత కొద్ది కాలానికే భార్య మరణం ఆయనను మరింత కృంగదీశాయి. మెగాస్టార్‌తో తొలి చిత్రం తీశానన్న తృప్తి మినహా ఆయన జీవితంలో సంతోకరమైన విషయాలేవీ లేకపోవడం దురదృష్టకరం. సినిమా నిర్మాతగా, దర్శకుడిగా, గీత రచయితగా, కథా రచయితగా చేసినప్పటికి సొంత ఇంటి భాగ్యానికి నోచుకోలేదు. రెండో కొడుకు దగ్గర ఉంటూ బ్రతుకుని భారంగా సాగిస్తున్నారు.

కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన రాజ్‌కుమార్ డిగ్రీ పూర్తి చేసి 1966లో హైదరాబాదుకు వచ్చారు. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో ట్రైనింగ్ తీసుకున్న ఆయన రెండు సంవత్సరాలు నారాయణగూడ కేశవ మెమోరియల్ స్కూల్‌లో ఫిజికల్ డైరక్టర్‌గా పని చేశారు. కాలేజీలో నాటకాలు చేసిన అనుభవం ఉన్న ఆయనకు సినిమాలపై మక్కువ పెరిగింది. పాతబస్తీలోని జహనుమాలోనా సదరన్ మూవీస్ స్టూడియోలో కో-డైరక్టర్‌గా అవకాశం దక్కించుకున్నారు. సినిమాలపై నమ్మకం కుదిరాక పునాదిరాళ్లు కథ తయారు చేసుకుని 1978లో ఆ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు.

ఆ చిత్రంలో ప్రధాన పాత్ర ధారులుగా చిరంజీవి, సుధాకర్‌తో పాటు, నరసింహరాజును తీసుకున్నారు. విడుదలకు ముందే సినిమా నిర్మాణం అద్భుతంగా ఉందంటూ చాలా మంది దర్శకులు రాజ్‌కుమార్‌ను మెచ్చుకున్నారు. దర్శకుడు క్రాంతి కుమార్ చిరంజీవిని గురించి రాజ్‌కుమార్‌ని అడగగా మంచి నటుడు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. దాంతో ఆయన తాను తీసే ప్రాణం ఖరీదు సినిమాలో చిరంజీవిని హీరోగా పెట్టి సినిమా తీశారు. అక్కడి నుంచి చిరంజీవి మళ్లీ తిరిగి వెనక్కి చూసుకునే అవకాశం రాలేదు.

రాజ్ కుమార్ ఆ తరువాత.. ఈ సమాజం నాకొద్దు, మన ఊరి గాంధీ, మా సిరిమల్లె తదితర ఎనిమిది సినిమాలకు దర్శకత్వం వహించారు. కానీ ఆర్థికంగా మాత్రం ఎగలేకపోయారు. ఉన్న ఆస్తులు అమ్ముకుని సినిమాల మీద ఇష్టంతో చిత్రాలు తీసారు. ఇప్పటికే గుండెకు రెండు స్టంట్‌లు వేశారు. రెండు నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. వైద్య ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. బావగారు బాగున్నారా చిత్ర సమయంలో చిరంజీవి తనను పిలిపించి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారని ఆయనే తనకు స్ఫూర్తి అని రాజ్‌కుమార్ అంటున్నారు. 70754 42277కు సంప్రదించి సహాయం చేయవలసిందిగా సినీ పెద్దలను కోరుతున్నారు.

Next Story