విషమంగానే లోకో పైలెట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి

కాచిగూడ రైలు ప్రమాదంలో గాయపడ్డ లోకో పైలెట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి.. ఇంకా విషమంగానే ఉంది. కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన కుడికాలికి వైద్యులు సర్జరీ చేశారు. కుడికాలిని మోకాలు పైభాగం వరకు తొలగించారు. రైలు ప్రమాదంలో MMTS ఇంజిన్‌లో ఇరుక్కుపోయిన చంద్రశేఖర్‌.. తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఆయన పక్కటెముకలు విరిగాయని, మూత్రపిండాలు తీవ్ర ఒత్తిడికి గురై పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు వైద్యులు. కాలుకు రక్తప్రసరణ సరిగా కాకపోవడంతో కుడి కాలును తొలగించినట్లు తెలిపారు. ప్రస్తుతం అతనికి.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి నెమ్మదిగా కుదుట పడుతుందన్నాడు ఆయన తండ్రి జోషఫ్. తన కొడుకు స్పృహలోకి వచ్చాడని, అందరినీ గుర్తు పడుతున్నాడని అన్నారు. ఆరు వారాల తర్వాత మరొక సర్జరీ చేస్తామని వైద్యులు తెలిపారని, శరీర భాగంలో మల్టిపుల్ గాయాలయ్యాయని చెప్పారన్నారు. ఆరోగ్యం మెరుగైన తరువాత వైద్యులు ఆ ప్రాంతాల్లో సర్జరీ చేసే అవకాశం ఉందంటున్నారు.

ఎఎంటీఎస్‌కు లోకో పైలెట్‌గా ఉన్న చంద్రశేఖర్ సిగ్నల్ చూసుకోకుండా ముందుకు వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని.. రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. దీంతో.. కాచిగూడ జీఆర్పీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చంద్రశేఖర్ కోలుకున్నాక అతని వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు పోలీసులు. స్టేషన్ మాస్టర్‌తో పాటు సిగ్నలింగ్ విభాగంలో పనిచేసే వారిని కూడా విచారించనున్నారు పోలీసులు. మరోవైపు హై లెవల్ కమిటీ కూడా ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story